కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ అవుతానని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి డిపాజిట్లు రాలేదు. కనీసం పది శాతం ఓట్లు వస్తాయనుకున్నారు కానీ మూడు శాతం దగ్గరే ఆగిపోయాయి. దీంతో ఆయన పార్టీ ఉంటుందా.. ఊడుతుందా అన్న ప్రచారం ప్రారంభమయింది. దీంతో ప్రశాంత్ కిషోర్ తన పార్టీని కాపాడుకోవాల్సింది ప్రజలేనని అంటున్నారు.
బీహారీలంతా ఏడాదికి ఓ వెయ్యి రూపాయలు తన పార్టీకి విరాళం ఇవ్వాలని ఆయన పిలుపునిస్తున్నారు. తాను ఏమీ ఇవ్వకుండా ప్రజలు ఎలా ఇస్తారని అనుకుంటున్నారేమో కానీ.. తన యావదాస్తి .. ఒక్క ఢిల్లీలో ఇల్లు తప్ప అన్నీ పార్టీకి రాసిచ్చేస్తానని.. గత ఇరవై ఏళ్లలో సంపాదించినదంతా ఇచ్చేస్తానని అంటున్నారు. ఇకపై సంపాదించే ఆదాయంలోనూ 90 శాతం పార్టీకే ఇస్తానని చెబుతున్నారు. అయితే అది పార్టీ నడపడానికి సరిపోదని.. బీహారీలంతా ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్లో ఓ వెయ్యి రూపాయలు తన పార్టీకి ఇవ్వాలని అడుగుతున్నారు.
రాజకీయాల్లో ప్రజలు తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. రాజకీయ పార్టీలు అలా అలవాటు చేశాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీ కోసం పార్టీని నడుపుతాను.. మీరే పోషించాలని అంటున్నారు. అది ఎంత వరకు సాధ్యమవుతుందో కానీ.. ఆయన మాత్రం.. డిపాజిట్లు కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా రాజకీయాలు చేస్తున్నారు. జనవరి నుంచి ఇంటింటికి పార్టీ కార్యకర్తలను పంపే కార్యక్రమాన్ని ప్రకటించారు.