అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీని ఇండియాలో నిలబెట్టిన వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. రాజ్ & డీకే సృష్టించిన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటికే రెండు సీజన్లు ఆదరణ తెచ్చుకోవడంతో మూడో సీజన్ పై అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత మూడో సీజన్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సీజన్లో ఏజెంట్ శ్రీకాంత్ తివారీ అండ్ కో చేసిన ఆపరేషన్స్ ఏ మేరకు వినోదాన్ని పంచాయి? శ్రీకాంత్ కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? నాగాలాండ్ రెబల్స్, డ్రగ్స్ మాఫియా నేపథ్యం ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చిందా?
‘గువాన్-యు’ ప్రాజెక్ట్ ద్వారా నార్త్ ఈస్ట్ ఇండియాలో అలజడి సృష్టించాలని పన్నాగం పన్నుతుంది చైనా. దీన్ని ఎదుర్కోవడానికి ప్రధాని బసు (సీమా బిశ్వాస్) ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ సహకార్’ ప్రారంభిస్తుంది. రెబల్ గ్రూప్‌లతో చర్చల కోసం శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయి), కులకర్ణి నాగాలాండ్ వెళ్తారు. ఈ చర్చలు జరగకుండా చేయడానికి డ్రగ్స్ స్మగ్లర్ రుక్మాంగధ (జైదీప్ అహ్లావత్)తో మీరా ఎస్టిన్ (నిమ్రత్ కౌర్) డీల్ చేసుకుంటుంది. డీల్ ప్రకారం రుక్మా గ్యాంగ్ కులకర్ణిని హత్య చేస్తుంది. ఈ దాడిలో గాయాలతో బయటపడ్డ శ్రీకాంత్ రుక్మా గ్యాంగ్ కోసం పర్సనల్‌గా వేట మొదలుపెడతాడు. అయితే కులకర్ణి కేసులో ‘టాస్క్’ శ్రీకాంత్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. తర్వాత ఏం జరిగింది? శాంతి చర్చలను ఎందుకు అడ్డుకున్నారు? శ్రీకాంత్ తన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేశాడు? రుక్మాంగధని పట్టుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ విజయానికి ముఖ్య కారణం నమ్మశక్యంగా అనిపించే కథకథనాలు, అన్నిటికంటే శ్రీకాంత్ తివారీ క్యారెక్టరైజేషన్. ఇంట్లో సాధారణ తండ్రి, బయట ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ పడే పాట్లు, ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హై టెన్షన్ థ్రిల్లో కూడా హ్యూమర్ మిక్స్ చేసే ట్రీట్మెంట్ ఈ సిరీస్ లో ప్రధాన ఆకర్షణ. సీజన్ 3లో కూడా ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే.. శ్రీకాంత్ తివారీ క్యారెక్టర్ ఈసారి కాస్త కొత్త ఛాలెంజ్ వైపు డైవర్ట్ అయ్యింది. ప్రభుత్వాన్ని ఆపద నుంచి కాపాడే శ్రీకాంత్, ఈ సీజన్లో ప్రభుత్వం దృష్టిలో తానే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అపవాదుని మోస్తూ చేసిన ప్రయాణం మాత్రం గత సీజన్లను మ్యాచ్ చేయలేకపోయింది.
సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్. ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు గంట. మొదటి మూడు ఎపిసోడ్స్ చకచక సాగిపోతాయి. నాగాలాండ్ బాంబ్ బ్లాస్ట్‌తో కథ మొదలౌతుంది. తర్వాత శాంతి చర్చలు, అక్కడే కులకర్ణి హత్య, తండ్రి లాంటి కులకర్ణి కళ్లముందే చనిపోవడంతో శ్రీకాంత్ పడే బాధ.. ఇవన్నీ తరువాతి అంకాలపై ఆసక్తిని పెంచుతాయి. ఈ సీజన్లో రుక్మాంగధగా జైదీప్ అహ్లావత్ని దించారు. ఆయన ‘పాతాళ్ లోక్’ సిరీస్‌తో పాపులర్. కాకపోతే ఆయన్ని మ్యాచ్ చేసే క్యారెక్టరైజేషన్ ఇందులో లేదు. డ్రగ్స్ దందా, కళ్లముందే ప్రేమించిన అమ్మాయి చనిపోవడం… ఈ రెండు సీక్వెన్స్‌ల తర్వాత రుక్మా క్యారెక్టర్‌పై అంచనాలు పెరుగుతాయి. కానీ సిరీస్ ముందుకు సాగుతున్నకొద్దీ క్యారెక్టర్లో ఎమోషన్ అంతగా వర్క్ అవుట్ కాలేదు.
నాలుగో ఎపిసోడ్ నుంచి కథనం కూడా కాస్త పట్టుతప్పినట్లుగా ఉంటుంది. శ్రీకాంత్ ఫ్యామిలీ డ్రామా ఈసారి అంత సహజంగా అనిపించలేదు. పైగా సన్నివేశాల్లో సుదీర్ఘమైన సంభాషణలు ఎక్కువయ్యాయి. శ్రీకాంత్ స్థానంలో వచ్చిన కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ట్రాక్ సరిగా కుదరలేదు. శ్రీకాంత్, జేకే ఇద్దరూ ఇన్వెస్టిగేషన్ కోసం దిగడంతో మళ్ళీ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. అయితే ఈ సిరీస్‌కు ఇచ్చిన క్లైమాక్స్ మాత్రం నిరాశపరిచింది. నాలుగేళ్ల నిరీక్షణకు ఇలా రైటింగ్‌తో ముగింపు ఇవ్వడం ఫ్యామిలీ మ్యాన్ అభిమానులకు రుచించదు. సీజన్ 4లో చూసుకుందాం అనే ధోరణి కథను ముగించడం కచ్చితంగా నిరాశే.
శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయి మరోసారి ఆ పాత్రలో జీవించేశారు. చాలా సీన్స్‌ని తన ఈజ్‌తో నిలబెట్టాడు. ముఖ్యంగా ఈ సీజన్లో తన పిల్లలతో మాట్లాడే తీరు మంచి హ్యూమర్ పండించింది. ఈ సీజన్లో శ్రీకాంత్, ప్రియమణి విడాకులు మీడియాకి ఎక్కించారు. శ్రీకాంత్ పిల్లల పాత్రల్లో ఆశ్లేష ఠాకూర్, వేదాంత్ ఈసారి కథనంలో భాగం కాలేకపోయారు. ఆ ట్రాక్ ఫిల్లర్స్‌గా ఉంటుంది తప్ప.. వాటి వల్ల కథకు కొత్తగా చేకూరిన ప్రయోజనం ఏమీ ఉండదు. శ్రీకాంత్–జేకే డైలాగులు మరోసారి నవ్వులు పంచాయి. అన్నట్టు ఈ సీజన్లో విజయ్ సేతుపతి, సందీప్ కిషన్, చెల్లమ్ సర్ గెస్ట్ అప్పీయరెన్స్ తరహా పాత్రల్లో మెరిశారు.
ఈసారి నార్త్ ఈస్ట్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ సామాజిక రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉంటే ఇందులో చర్చించిన కొన్ని అంశాలు లోతుగా అర్థమౌతాయి. ఈ సీజన్లో మరింత విజువల్ రిచ్‌నెస్ కనిపించింది. మ్యూజిక్, ఎడిటింగ్ డీసెంట్‌గా కుదిరాయి. నాలుగో సీజన్‌కు లీడ్ ఇస్తూ అసంపూర్ణంగా సిరీస్‌ని ముగించారు. ఈ ముగింపు మాత్రం ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్ ఆశించినది కాదు.