ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసీ నీలం సహాని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఆమె హయాంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. నిజానికి ఆమె జగన్ నియమించి ఎస్ఈసీ. ఏరి కోరి ఆమెను తీసుకు వచ్చి పదవిలో కూర్చోబెట్టారు. దీనికి కారణం.. ఆమె సీఎస్ గా ఉన్నప్పుడు జగన్ చెప్పినట్లుగా చేశారు. ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులు పడినా పట్టించుకోలేదు. అయినా సరే.. ఎస్ఈసీ స్థానానికి గౌరవం ఇచ్చి ఆమె నేతృత్వంలోనే ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు.
వచ్చే ఏడాది మార్చి వరకే నీలం సహాని పదవి కాలం
రాష్ట్ర ఎన్నికల అధికారికగా నీలం సహాని పదవి కాలం వచ్చే ఏడాది మార్చి వరకే ఉంది. గతంలో లోకల్ పోల్స్ పూర్తయిన తర్వాత ఎస్ఈసీగా నీలం సహాని బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు పెద్దగా పని లేదు. ఉపఎన్నికలు ఎప్పుడో ఓ సారి నిర్వహించడం తప్ప చేసిదేమీ లేదు. ఇటీవల పులివెందుల జడ్పీటీసీకి ఉపఎన్నికలు నిర్వహించారు. ఆమె నేతృత్వంలో ఎన్నికలు వద్దనుకుంటే ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ప్రక్రియను కాస్త ఆలస్యం చేస్తే సరిపోతుంది. కానీ ప్రభుత్వం మాత్రం అలా అనుకోవడం లేదు.
మార్చి లోపే ఎన్నికలు పూర్తి చేయాలని టార్గెట్
నీలం సహాని తన పదవి కాలంలోనే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎస్ఈసీ విధులు నిర్వర్తించినందుకు ఎన్నికలు నిర్వహించలేకపోతే వెలితిగా ఉంటుంది. అందుకే స్థానిక సంస్థల పదవీ కాలం ఆరు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించవచ్చన్న కాన్సెప్ట్ ను తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించారు. సన్నాహాలు ప్రారంభించారు. జనవరి నుంచి ప్రక్రియ ప్రారంభించి పంచాయతీలు, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఓటర్ల జాబితాపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమయింది.
వైసీపీ పోల్స్ బహిష్కరించే అవకాశం
స్థానిక ఎన్నికలను వైసీపీ బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పులివెందులలోనే ఘోర పరాజయం తర్వాత ఎక్కడా పరువు దక్కదని అనుకుంటున్నారు. తాము పోల్స్ బహిష్కరిస్తామని ఇప్పటికే సంకేతాలు పంపారు. అదే జరిగితే ఇక స్థానిక ఎన్నికలు ఎలా జరుగుతాయో చెప్పాల్సిన పని లేదు. పారిపోవద్దని.. పోరాడాలని వైసీపీ క్యాడర్ కోరుకుంటున్నారు. కానీ జగన్ రెడీగా లేరు.