తెలంగాణలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని రాజకీయవర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అనర్హతా వేటు వేయకపోయినా ఇద్దరితో రాజీనామాలు చేయించే పరిస్థితులు వస్తాయని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అంచనా వేస్తున్నారు. ఆ రెండు స్థానాలు ఖైరతాబాద్, స్టేషన్ ఘనపూర్. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారే కాదు మరో ఎనిమది మంది కూడా చేరారు. అయితే ఎనిమిది మంది తాము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి బయట పడిపోతున్నారు. కడియం , దానం మాత్రం అలాంటి అవకాశం లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
స్పీకర్‌కు సమాధానం చెప్పేందుకు వెనుకడుగు
సుప్రీంకోర్టు సీరియస్ అయి రోజువారీ విచారణ జరపాలని ఆదేశించడంతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. మిగిలిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేశారు. అయితే వారు సమాధానం చెప్పలేదు కానీ త్వరలో చెబుతామని జవాబు పంపారు. ఎప్పటికి చెబుతారన్నదానిపై స్పష్టత లేదు. వారి స్పందనను బట్టి చూస్తే తాము పార్టీ మారలేదని వాదించడానికి సిద్ధంగా లేరు. దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున లోక్ సభకు పోటీ చేశారు. కడియం పోటీ చేయకపోయినా ఆయన బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకునేందుకు సిద్ధంగా లేరు. కానీ కాంగ్రెస్‌లో చేరానని స్పీకర్‌కూ లిఖితపూర్వకంగా చెప్పేందుకూ ఇష్టపడటం లేదు.
అనర్హతా వేటు అనివార్యమయితే రాజీనామాలు
మామూలుగా అయితే అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు. కానీ సుప్రీంకోర్టు గడువు పెట్టడంతో .. కోర్టుకు ఎదురెళ్లే ఉద్దేశం లేకపోవడంతో ఎలా పాటించాలో తెలియక కిందా మీదా పడుతున్నారు. నాలుగు వారాల తర్వాత సుప్రీంకోర్టు స్పందనను బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుని తీరాల్సిందేనని స్పష్టం చేస్తే అప్పుడు ఎనిమిదిమందిపై పిటిషన్లు తిరస్కరించి.. ఇద్దరి దగ్గర రాజీనామాలు తీసుకుని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉప ఎన్నికలు వస్తాయన్నమాట. నిజానికి ఇలా స్పీకర్ ఆమోదిస్తే.. చట్టంలో లేకపోయినా సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్పీకర్ పాటించినట్లవుతుంది. ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. అందుకే రాజ్యాంగనిపుణులు కూడా జరగబోయే పరిణామాలపై ఆసక్తిగా ఉన్నారు.
ఉపఎన్నికలు రానే రావని చెబుతున్న రేవంత్
ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ గతంలో హెచ్చరిస్తూ ఉండేవారు. ఎలా వస్తాయని.. రేవంత్ ప్రశ్నించేవారు. గతంలో రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని ఆయన ఎదురు ప్రశ్నించేవారు. అప్పట్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా కూడా ప్రమాణం చేయించారు. అప్పుడు వారిపై అనర్హతా వేటు పడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ మాత్రం సరిగ్గా డీల్ చేయలేకపోతున్నా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలు ధైర్యంగా తాము కాంగ్రెస్ అని చెప్పుకోలేకపోతున్నారు. ఇద్దరి విషయంలో ఉపఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఉపఎన్నికలను ఆపగలిగితే.. రేవంత్ సక్సెస్ అవుతారు..లేకపోతే ఆయన బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎదుర్కొలేకపోయారన్న ఇమేజ్ వచ్చేస్తుంది.
