బీహార్లో మరోసారి గెలిచిన తర్వాత మా టార్గెట్ బెంగాల్ అని ప్రధాని మోదీ, అమిత్ షా సవాల్ చేశారు. మరో ఆరు నెలల్లో అంటే వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగనున్నాయి. మమతా బెనర్జీ ఇప్పటికి పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. కానీ నాలుగోసారి మాత్రం అంత తేలికగా కనిపించడం లేదు. ఎందుకంటే పదిహేనేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అప్పట్లో కమ్యూనిస్టులు వర్సెస్ మమతా బెనర్జీ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు కమ్యూనిస్టుల ప్లేస్లో బీజేపీ వచ్చి చేరింది.
కమ్యూనిస్టుల్ని నిర్వీర్యం చేసి బీజేపీని పెంచిన మమతా బెనర్డీ
బెంగాల్ రాజకీయంలో భారతీయ జనతా పార్టీ ఎదిగిందంటే దానికి కారణం మమతా బెనర్జీనే. బెంగాల్ లో కమ్యూనిస్టులు దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నారు. పైకి ఏం చెప్పినా బెంగాల్ లో వారు గ్రామాల్లో గ్రూపుల గొడవలు, హత్యా రాజకీయాల ద్వారా ఎక్కువగా అధికారంలో ఉన్నారని నమ్ముతారు. అలాంటి రాజకీయాలను ఎదిరించి మమతా బెనర్జీ విజయం సాధించారు. కమ్యూనిస్టు పార్టీపై వ్యతిరేకతతో ప్రజలు మమతా బెనర్జీని గెలిపించారు. ఆ తర్వాత ఆమె కమ్యూనిస్టుల చూపిన దారిలో తాను రెండాకులు ఎక్కువే చదివానన్నట్లుగా రాజకీయాలు చేసి క్రమంగా వారిని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. అదే సమయంలో బీజేపీ ఎదుగుతుందన్న సంగతిని గుర్తించలేదు.
నిలువ నీడ లేక బీజేపీ పంచన చేరిన కమ్యూనిస్టులు
కమ్యూనిస్టు భావజాలానికి, బీజేపీకి అసలు పొంతనే ఉండదు. కానీ రాజకీయం అంటే.. భావజాలం ఎప్పటికప్పుడు మారిపోవడమే. దానికి తగ్గట్లుగానే పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు దాడులకు గురవుతూంటే.. రక్షణ కోసం బీజేపీలో చేరిపోవడం ప్రారంభించారు. బెంగాల్లో ముస్లింలు కూడా ఎక్కువే. అయితే వారిలోనూ కమ్యూనిస్టులు ఎక్కువ. వర్గ పోరాటాల్లో కొంత మంది బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. పదేళ్ల కిందటి వరకూ బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి బెంగాల్. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు బ్యాంక్ కేవలం 10 శాతం. 2019 లోక్సభ ఎన్నికల్లో అది 40 శాతానికి చేరుకుంది. 2021 అసెంబ్లీలో 38 ళాకం , 2024 లోక్సభ ఎన్నికలలోనూ అంతే పర్సంటేజీలో ఓట్లు సాధించి బలంగా నిలిచింది
బీజేపీ ఈ సారి మిస్ కావాలనుకోవడం లేదు !
బీజేపీలో ఇప్పుడు పెద్ద నేతలు ఉన్నారు. మమతా బెనర్జీ నీడలో ఎదిగిన నేతలే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. వారందరికీ మమతా బెనర్జీని ఎలాగైనా పదవి నుంచి దింపాలని టార్గెట్. అందుకే మోడీ, షా మార్గదర్శకత్వంలో వారు తమ పని ప్రారంభించారు. రాష్ట్రాన్ని 6 రాజకీయ జోన్లుగా విభజించి.. ప్రతి జోన్కు ఒక్కొక్క కీలక నేతకు బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఆరు నెలలు వారు ఈ పని మీదనే ఉంటారు. బీజేపీకి ప్రతి ఓటర్ ను చేరుకునే ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పట్టు, ముస్లింలపైనే దీదీ ఆశలు
కమ్యూనిస్టులను తరిమేసి గ్రామ స్థాయిలో పట్టు పెంచుకున్నారు మమతా బెనర్జీ. ఎవరైనా ఎదురుతిరిగితే దాడులు చేస్తారు. దాంతో పాటు ముఫ్ఫై శాతం వరకూ ఉన్న ముస్లింలలు గట్టి ఓటు బ్యాంకుగా ఉన్నారు. వారిపై నమ్మకంతో మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు. కానీ పదిహేనేళ్ల పాలన ప్రజా వ్యతిరేకత.. ఆమెకు పెను గండంగా మారనుంది. అందుకే.. ఈ సారి బీజేపీ నుంచి ఆమె ఓటమి తప్పించుకోవడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. బీజేపీని ఎదుర్కొని విజయం సాధిస్తే.. ఆమె ఇమేజ్ దేశంలో మరింతగా పెరుగుతుంది.