వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం వెళ్లాలంటే కనీసం వారం రోజుల గడువు కావాలి. ఆ వారం రోజుల ఏర్పాట్ల తర్వాతనే ఆయన పులివెందులలో అడుగుపెడతారు. తాజాగా జగన్ రెడ్డి ఇరవై ఆరో తేదిన పులివెందులలో పర్యటిస్తారని వైసీపీ ప్రకటించారు. ఎందుకంటే.. అరటి రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని వారిని పరామర్శిస్తారట. సొంత నియోజకవర్గంలో ప్రజల్ని పరామర్శించే అలవాటు జగన్ రెడ్డికి చాలా కాలం నుంచి లేదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు. పరిస్థితులు మారిపోయాయి. అందుకే అరటి రైతులు గుర్తుకు వచ్చారు.
పడిపోయిన అరటి ధరలు
కడప జిల్లాలో హార్టికల్చర్ పై రైతులు ఎక్కువగా ఆధారపడ్డారు. అరటి పంట బాగా పండుతుంది. బెంగళూరు వంటి మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకుంటూ ఉంటారు. అయితే ఈ సారి వర్షాలు బాగా పడటం వల్లనో.. మరో కారణమో కానీ పంట విరగకాసింది. అందుకే రేట్లు తగ్గిపోయాయి. రైతులు పంటను నేల మీద పోస్తున్నారని కొన్ని సోషల్ మీడియాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. దాంతో జగన్ కు..తాను మళ్లీ షో చేయాల్సిన అవసరం వచ్చిందని గుర్తించి రంగంలోకి దిగిపోతున్నారు.
సొంత నియోజకవర్గంలోనూ స్కిట్స్ తప్పవు !
ప్రభుత్వం ఇప్పటికే అరటి రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంది. అరటిని ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించి అయినా అమ్ముకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అరటి వాణిజ్య పంట అవుతుంది. ప్రభుత్వాలు కొనుగోలు చేయవు. అందుకే రైతులకు ఇబ్బంది లేకుండా.. బాగా రేటు వచ్చే మార్కెట్లకు తీసుకెళ్లేలా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జగన్ రంగంలోకి దిగుతున్నారు. ఎప్పట్లాగే హంగామా చేయాలి కాబట్టి నాలుగైదు రోజుల తర్వాత ఖరారు చేశారు. అందర్నీ సమీకరించి.. మోకాళ్ల దండాల నుంచి .. రప్పా.. రప్పా వరకూ సేమ్ సీన్లు కనిపించేలా పరామర్శ ఉంటుందనడంలో సందేహం లేదు.
అరటి రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు?
జగన్ రెడ్డి అరటి రైతులకు .. ప్రభుత్వం ఇవ్వకపోతే తాను పరిహారం ఇస్తానని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆయన పులివెందుల రైతులకు ఇలాగే ప్రకటించారు. చాలా మంది ప్రభుత్వం ఇచ్చినా సరిపోవడం లేదని జగన్ ఎందుకివ్వరని ప్రశ్నించడం ప్రారంభించారు. దాంతో ఆయన కొంత మంది రైతులకు పరిహారం తన పార్టీ నేతలతో ఇప్పించారు. ఇప్పుడు కూడా అలా.. అరటి రైతులకు ఏమైనా సాయం ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రకటించకపోతే అరటి రైతులు నిరాశకు గురవుతారు. ఎందుకంటే జగన్ ఎంత సంపాదించుకున్నారో వారికి బాగా తెలుసు.
