ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తరవాత వచ్చిన లవ్లీ కూడా ఓకే అనిపించుకొంది. కొన్ని మంచి సినిమాలు చేసినా ఆ తరవాతి నుంచి ఎందుకో బ్రేక్ రాలేదు. అన్ని జోనర్లూ టచ్ చేశాడు. కానీ ఫలితం కనిపించలేదు. ఈమధ్య ఆది విరివిగానే సినిమాలు చేస్తున్నాడు. కానీ హిట్ అనేది అందని ద్రాక్షలానే ఊరిస్తోంది. ఈమధ్య ఆది చేసిన సినిమాల్లో కాస్తో.. కూస్తో బజ్ ఉన్న సినిమా ‘శంబాల’. ఈ సినిమా కోసం ఆది గట్టిగానే కష్టపడ్డాడు. నిర్మాతలు కూడా ఆది మార్కెట్ ని మించి ఖర్చు పెట్టేశారు. డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలెట్టేశారు.
ఇటీవల ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ ఎఫెక్ట్ తో ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకోగలిగింది ఈ సినిమా. రిలీజ్కు ముందే ఆహా ఓటీటీ రైట్స్ దక్కించుకొంది. శాటిలైట్ హక్కులు ‘జీ’కి దక్కాయి. రెండింటి వల్ల దాదాపు రూ.7 కోట్ల వరకూ వెనక్కి తెచ్చుకోగలిగారు. హిందీ డబ్బింగ్ రైట్స్ ఎలాగూ ఉన్నాయి. ఎలా చూసినా ఈ సినిమాకు ఇది మంచి బేరమే. ఈమధ్య పెద్ద సినిమాలే ఓటీటీ హక్కులు అమ్ముకోలేక డీలా పడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ‘శంబాల’ డీల్ క్లోజ్ చేసుకొందంటే గొప్ప విషయమే. ఈ సినిమాతోనే ఆది కెరీర్ ముడిపడి వుంది. ఈ సినిమా అటూ ఇటు అయితే… తన కెరీర్ గల్లంతైనట్టే. ఈ విషయం తనక్కూడా తెలుసు. కాబట్టి.. ఈ సినిమా విషయంలో ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేస్తున్నాడు. ఓటీటీ వల్ల నిర్మాతలు కొంతమేర సేఫ్ అయ్యారు. కానీ పూర్తి స్థాయిలో బయటపడాలంటే.. బాక్సాఫీసు దగ్గర కూడా మంచి వసూళ్లు రాబట్టుకోవాల్సిందే. ఉగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.