రాజకీయ నాయకులు చాలా హామీలు ఇస్తూంటారు. కానీ గుర్తు పెట్టుకుని ఆ హమీలు అమలు చేస్తే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలాంటి గుర్తింపు సాధించుకుంటున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా, ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్లారు. అప్పుడు ఆలయాని ప్రదక్షిణ మండప నిర్మాణంతోపాటు గ్రామం నుంచి కొండ పైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మింపచేస్తానని హామీ ఇచ్చారు.
ఆ హామీని మర్చిపోలేదు.. అన్ని మంత్రిత్వశాఖల ద్వారా ఫాలో అప్ చేసుకుని ఆలయ అభివృద్ధికి రూ. 8.7 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు. సోమవారం స్వయంగా వెళ్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల భూ కేటాయింపుకి సంబంధించిన పత్రాలు సోమవారం పవన్ కళ్యాణ్ గారు ఆలయ అధికారులకు అందజేశారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఐ.ఎస్. జగన్నాథపురం వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు దారి పొడవునా పూల వర్షంతో స్వాగతం పలికారు. రాజవరం, యర్రంపేట, గవరవరం, ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. పలువురు తమ సమస్యలను తెలియచేసేందుకు ముందుకు వచ్చారు. వారి వద్దకు వెళ్ళి వినతి పత్రాలు స్వీకరించి, వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణంలో పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలను ఆప్యాయంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు.
