పంచాయతీ ఎన్నికలను వచ్చే నెల మూడో వారం కల్లా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తారు. రేవంత్ రెడ్డికి పల్లెల్లో ఎన్నికలను ఎలా నిర్వహించాలో తెలుసు. ఎలాంటి ఎజెండా తీసుకుంటే బాగుంటుందో తెలుసు. అందుకే ఆయన గేమ్ ఆయన ఆడుతున్నారు. కానీ విపక్షాలు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఎజెండాతో పోరాడాలని అనుకుంటున్నాయి. దీంతో మొదట్లోనే తప్పులో కాలేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రతి పంచాయతీ ఓ రాష్ట్రమే
రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు చేసేవారు.. గ్రామ స్థాయి రాజకీయాల్లో రాణించలేరు. ఓ మాదిరి జనాభా ఉన్న గ్రామానికి సర్పంచ్ గా గెలవడం అంటే చిన్న విషయం కాదు. ఆ గ్రామంలో ఎన్ని రకాల రాజకీయాలు జరుగుతాయో.. నిజంగా తెలిసిన వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి రాజకీయాల్ని తట్టుకోవడం ఆ గ్రామ నాయకులకే సాధ్యం అవుతుంది. ఈ రాజకీయాల్లో కులం, మతం ఉండవు. ఆధిపత్య పోరాటమే ఉంటుంది. ఆ ఆధిపత్యం వర్గాల్లో ఉంటుంది కానీ అది కులం, మతం ఆధారంగా ఉండదు. ఆ ప్రభావం .. అంతా ఆ గ్రామానికి సంబంధించిన టాపిక్స్ మీదనే ఉంటుంది. అంటే.. ఆ గ్రామ అంశాలే ఓటింగ్ ను నిర్దేశిస్తాయి. రాష్ట్ర స్తాయి అంశాలకు ప్రాధాన్యత ఉండదు.
గ్రామ రాజకీయాల్లో రాష్ట్ర అంశాలకు చోటు ఉండదు !
గ్రామస్థాయి రాజకీయాల్లో రాష్ట్ర అంశాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా.. కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో ఓటింగ్ కు పరిగణనలోకి తీసుకోలేరు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేదని చెప్పినా.. ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని అనుకోరు. ఎందుకంటే పార్టీ పరంగా ఎన్నికలు జరగవు. అంతకు మించి ఆ సమస్యలు కంటే.. గ్రామ రాజకీయాల్లో ఉండే సమస్యలే వారికి ముఖ్యం. అందుకే అలాంటి అంశాలను అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ హైలెట్ చేసినా ఎవరూ పట్టించుకోరు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాల్సింది ఆయా పార్టీలే.
కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తే బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోయినా పర్వాలేదని ప్రజలు ఒప్పుకున్నట్లా?
పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి . కానీ మద్దతుదారులు ఉంటారు. అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంది. అది సహజంగా జరిగే ప్రక్రియ . అంత మాత్రాన బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ విధానానికి మద్దతు పలికినట్లు కాదు.కానీ బీఆర్ఎస్ చేసే రాజకీయాల వల్ల అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆ పార్టీకి బుద్ది చెప్పాలని ఎంత గగ్గోలు పెట్టినా పంచాయతీ ఓటర్లకు అది ఎక్కదు. రాజకీయాల్లో పండిపోయామనుకునేవారు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేుకోలేకపోతున్నారో మరి.!
