ఆంధ్రప్రదేశ్ ఐటీ , ఎలక్ట్రానిక్స్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిసెంబర్ మొదటి వారంలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తెలుగు కమ్యూనిటీతో సమావేశం అవడంతో పాటు పెట్టుబడుల కోసం వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.
డిసెంబర్ ఆరో తేదీన శనివారం డాలస్‌లో “ తెలుగు కమ్యూనిటీ విత్ నారా లోకేష్” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టెక్సాస్, ఒక్లహోమా, లూసియానా, ఆర్కాన్సాస్ రాష్ట్రాల నుంచి తెలుగువారు, టీడీపీ సానుభూతిపరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, యువ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ఆకర్షణ, టెక్-ఐటీ రంగాల్లో అవకాశాలపై నారా లోకేష్ మాట్లాడనున్నారు.
గతేడాది అక్టోబర్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐటీ సర్వ్ సమ్మిట్ తర్వాత మరోసారి అమెరికాకు వస్తున్నారు. ఈ సారి పర్యటనలో శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ తో పాటు మరికొన్ని నగరాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంకా అధికారిక షెడ్యూల్ పూర్తిగా వెల్లడి కాలేదు. టెక్ దిగ్గజం కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ సమావేశం అయి.. గూగుల్ ఏఐ హబ్ రాకతో మారనున్న విశాఖ టెక్ ముఖ చిత్రం గురించి ప్రమోట్ చేసి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది.
