టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు యూనివర్శిటీపై ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ జరిపిన దర్యాప్తుపై చర్యలపై స్పష్టత లేకుండాపోయింది. 2022లో శ్రీ విద్యానికేతన్గా ఉన్న సంస్థను మోహన్ బాబు యూనివర్శిటీగా మార్చిన ఈ ఇన్స్టిట్యూషన్పై అధిక ఫీజుల వసూలు, ఆదాయం దాచడం, అటెండెన్స్ రికార్డుల్లో అక్రమాలు, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను చేతిలో పెట్టుకోవడం వంటి ఆరోపణలు ఎదుగుతున్నాయి.
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా APHERMC మూడు మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దర్యాప్తులో యూనివర్శిటీ 2022-23 అకడమిక్ ఇయర్ నుంచి సెప్టెంబర్ 2024 వరకు రూ.26.17 కోట్ల అధిక ఫీజులు వసూలు చేసినట్టు తేలింది. ఇందుకు సంబంధించి కమిషన్ సెప్టెంబర్ 17న 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక మొత్తాన్ని 15 రోజుల్లోపు విద్యార్థులకు రిఫండ్ చేయాలని ఆదేశించింది.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ , ఆల్-ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్శిటీ గుర్తింపును ఉపసంహరించాలని సిఫార్సు చేసింది. ఈ ఆర్డర్‌పై యూనివర్శిటీ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మూడు వారాల మధ్యంతర రిలీఫ్ పొందింది. తర్వాత ఆ కేసులో స్పష్టత లేదు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన మొత్తం తిరిగి ఇచ్చేసిందా లేదా..అన్నదానిపైనా వివరణ లేదు. వేలాది మంది విద్యార్థుల నుంచి పిండుకున్న ఫీజులు కావడంతో వారు కూడా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.