చిరంజీవితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. విలక్షణ దర్శకుడు ఉపేంద్రకు కూడా చిరంజీవిని డైరెక్ట్ చేయాలనే కోరిక ఉంది. నిజానికి ఈ కాంబినేషన్ గతంలో చేయాలనుకున్నారు. కానీ ఏవో కారణాల వలన కుదరలేదు. ఆంధ్ర కింగ్ ప్రచారంలో చిరంజీవి సినిమా టాపిక్ వచ్చింది. ‘చిరంజీవి గారితో సినిమా నాకు ఒక పెద్ద డ్రీం. అన్ని కుదిరితే ఖచ్చితంగా ఆ సినిమాను చేస్తాను’ అని చెప్పుకొచ్చారు ఉపేంద్ర.
చిరంజీవి–ఉపేంద్ర.. కాంబినేషన్ పరంగా క్రేజీగా ఉంటుంది. చిరంజీవి పక్కా మాస్ కమర్షియల్ సినిమాలు చేసే హీరో. ఉపేంద్ర డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో కథను మెటాఫర్గా చెప్పే దర్శకుడు. ఇలాంటి కాంబినేషన్ ఇప్పుడున్న రోజుల్లో ఖచ్చితంగా ఆసక్తికరం. పైగా ఉపేంద్రకు ఒరిజినల్ ఫిల్మ్‌మేకర్‌గా ఒక గౌరవం ఉంది. ఒకవేళ చిరంజీవి ప్రయోగాత్మకంగా ఒక సినిమా ప్రయత్నించాలంటే ఉపేంద్ర మంచి ఆప్షనే.
పైగా ఉపేంద్రకు హీరోగా కూడా స్టార్ వాల్యూ ఉంది. ఇలాంటి ఇద్దరూ కలిసి సినిమా చేస్తే బజ్ విషయంలో డౌట్ ఉండదు. కాకపోతే ఉపేంద్ర చెప్పే కథలు, మేకింగ్, టేకింగ్ ‘మినిమం డిగ్రీ’ అన్నట్టుగా ఉంటాయి. చిరంజీవి సినిమా అంటే అన్ని సెంటర్లలో ఆడాలి. అలాంటి కథ కుదిరితే ఈ క్రేజీ కాంబినేషన్‌కు అంకురార్పణ జరిగే అవకాశం ఉంది.