ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పంటలు పండించే రైతులకు పెద్దగా ఏదీ కలసి రావడం లేదు. ప్రభుత్వం ఆదుకుంటున్నా అది నష్టాలు భర్తీ చేయడానికే తప్ప ఆరుగాలం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు. తోతాపురి మామిడి, ఉల్లి, టమాటా రైతుల కష్టాలు మర్చిపోక ముందే ఇప్పుడు కొత్తగా అరటి రైతులకు సమస్యలు వచ్చాయి. ప్రభుత్వం అరటి రైతుల్ని ఆదుకోవడానికి యంత్రాంగాన్ని రంగంలోకి దించింది.
భారీగా అరటి దిగుబడి – తగ్గిన డిమాండ్
కడప జిల్లాతో పాటు ఆ చుట్టుపక్కల అరటి పంట బాగా పండుతుంది. సాధారణంగా రైతులు అరటి పంటను లోకల్ మార్కెట్ తో పాటు బెంగళూరుకు తరలించి అమ్ముకుంటారు. అయితే ఈ సారి వర్షాలు సమయానికి కురవడం, పరిస్థితులు అన్నీ కలసి రావడంతో పంట ఎక్కువగా వచ్చింది. అయితే డిమాండ్ మాత్రం పెరగలేదు. ఉత్పత్తి ఎక్కువగా ఉండటం.. డిమాండ్ పెరగకపోవడంతో అరటి ధర దారుణంగా పడిపోయింది. దాంతో అరటి గెలల్ని రైతులు వదిలేసుకోవాల్సి వచ్చింది. మరోసారి పంట వేయడానికి అరటి చెట్లను తొలగించాల్సి రావడంతో నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
తోతాపురి, ఉల్లి రైతులకూ అదే సమయం
ఈ ఏడాది తోతాపురి మామిడి రైతులకూ అదే సమస్య వచ్చింది. భారీగా వచ్చిన దిగుబడికి తోడు పల్ప్ కంపెనీలు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేయాల్సి వచ్చింది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద రైతులకు సాయం అందించారు. తర్వాత ఉల్లి ధరలు కూడా అదే రీతిలో పడిపోయాయి. దాంతో ప్రభుత్వం రైతుకు హెక్టార్‌కు రూ.యాభైవేల సాయం ఇచ్చింది. అయితే రైతులకు పండిన పంటకు.. సాధారణ ధర వచ్చినా వారికి మంచి లాభం వచ్చేది. కానీ సరైన ధర రాకపోవడంతో ఎక్కువగా నష్టపోయారు.
ఇప్పుడు పెరుగుతున్న ధరలు
ఉల్లిపాయ, టమోటా, తోతాపురి వంటి ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. టమాటా ధర బహిరంగ మార్కెట్లో కేజీ అరవై రూపాయలకు చేరింది. అరటి పండ్లు రీటైల్ గా డజన్ 70 నుంచి 120 రూపాయల వరకూ అమ్ముతున్నారు. కానీ రైతులకు మాత్రం కేజీకి రూపాయి కూడా లభించడం లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో వ్యవసాయ శాఖ అధికారులే విశ్లేషించుకోవాల్సి ఉంది. పంట భారీగా వచ్చినప్పుడు కొనుగోలు చేసి గోడౌన్లలో నిల్వ చేసి రేట్లు పెరిగినప్పుడు మార్కెట్ లోకి రిలీజ్ చేస్తే ధరలు స్థిరంగా ఉంటాయి. కానీ పంటలు చేతికొచ్చినప్పుడు రైతులు.. ఆ తర్వాత వినియోగదారులు నష్టపోతూనే ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించినప్పుడే రైతులకు మేలు జరుగుతుంది.