వైసీపీలో అధినేత జగన్‌ను మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లుగా బూతులందుకుంటారు నేతలు. అలా అందుకోకపోతే జగన్ మెచ్చరు. అందుకే ఆ పార్టీలో చాలా మంది ఇప్పుడు కలుగుల్లో దాక్కుని బిక్కుబిక్కుమంటున్నారు. వారంతా గీత దాటినప్పుడు..ఇది తప్పు మనం అలా చేయకూడదని చెప్పిన వారు లేరు. ఇంకా ప్రోత్సహించారు. కానీ టీడీపీలో మాత్రం పరిస్థితి అలా ఉండదు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా తప్పు చేస్తే వదిలి పెట్టరు. టీడీపీ స్థాయి విలువలు పాటించాల్సిందే. తేడా వస్తే హెచ్చరించడానికి .. సుతిమెత్తగా సలహాలు ఇవ్వడానికి నారా లోకేష్ కూడా రెడీగా ఉంటారు.
సోషల్ మీడియా క్యాడర్‌కు సుతిమెత్తగా చీవాట్లు పెట్టిన లోకేష్
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు.. జగన్ ప్లీజ్ గివ్ మీ అపొజిషన్ స్టేటస్ అనే ప్లకార్డు పట్టుకుని రోడ్డు పక్కన కూర్చుని బతిమాలుతున్నట్లుగా ఓ ఏఐ వీడియోను టీడీపీ క్యాడర్ తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. ఇది నారా లోకేష్ దృష్టికి వచ్చింది. ఇలాంటివి టీడీపీ విధానాలకు విరుద్ధమని స్పష్టమైన సూచన చేస్తూ సోషల మీడియాలోనే స్పందించారు. వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కాదని.. మనం రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, కానీ మన ప్రవర్తనం గౌరవంగా ఉండాలన్నారు. అలాంటి కంటెంట్‌ను నివారించాలని అందరినీ కోరారు. వ్యతిరేకత వ్యక్తం చేయడంలోనూ కూడా మర్యాదను కాపాడుకుందామని, ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెడదామని సూచించారు.
వైసీపీ పెద్దలు సిగ్గుపడాలి !
నిజానికి ఏఐ వీడియో అంత అభ్యంతరకంగా లేదు. కానీ అలా చేయడం అంత మంచిది కాదన్న అభిప్రాయం ఉంటుంది. అందుకే నారా లోకేష్ స్పందించారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవతర్సాల కాలంలో ఎప్పుడైనా ఇలా ఓ కార్యకర్తను తప్పు చేశారని మందలించిన సందర్భం ఉందా?. ఇంకా కంటెంట్ ను.. పార్టీ ఆఫీసు నుంచి పంపించి పుట్టుకలను ప్రశ్నించడానికి బరి తెగించమని రెచ్చగొట్టారు. సాఫ్ట్ గా ఉండేవారిని.. మంచిగా పోస్టులు పెట్టేవారిని ..తమ పార్టీకి అవసరం లేదని దూరం పెట్టారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకత్వం మాత్రం.. దారి తప్పే తమ క్యాడర్ ను అవసరమైతే గట్టిగా.. లేకపోతే సుతిమెత్తగా దారిన పెట్టే ప్రయత్నం చేసుకుంటోంది.
బూతులు లేని రాజకీయాలు ఇప్పుడు ఏపీ ప్రత్యేకత
బూతులు లేని రాజకీయాలు ఇప్పుడు ఏపీలో ఉన్నాయి. ఐదు సంవతర్సాల పాటు ప్రజల చెవుల్లో సీసం పోసినట్లుగా బూతులు మాట్లాడారు.కానీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎవరూ మాట్లాడటం లేదు. టీడీపీ నేతలు మాట్లాడినా.. వైసీపీ నేతలు మాట్లాడినా చర్యలు తీవ్రంగా ఉంటున్నాయి. జగన్ రెడ్డి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ కార్యకర్తను కూడా అరెస్టు చేశారు. అలా చేయకపోతే ఇంకా చాలా మంది అలాంటి మాటలు మాట్లాడేవారు. దాని వల్ల సానుకూల పరిస్థితి మారిపోతుంది. ఆ ఒక్క కార్యకర్తపై కఠినంగా వ్యవహరించడం వల్ల చాలా మంది.. కంట్రోల్ చేసుకోగలిగారు. వైసీపీ అలాంటి పనిని అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే.. వైసీపీపై బూతు పార్టీ అనే ముద్ర పడి ఉండేది కాదు.