ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సబ్ కమిటీకి సూచించారు. తుది ప్రతిపాదనలు సబ్ కమిటీ త్వరలో ప్రతిపాదించనుంది. మొత్తంగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాలన్నీ కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు జిల్లాల మార్పుచేర్పులు, సరిహద్దుల మార్పు చేస్తున్నారు. కానీ త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అలాంటప్పుడు ఈ జిల్లాల విభజన తర్వాత సమస్యలు సృష్టిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
చట్టం ప్రకారం జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
2026 వరకూ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదు. అది రాజ్యాంగంలో ఉంది. 2026 తర్వాత మొదటి జనాభా లెక్కలు ఆధారంగా చేయాల్సి ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 82 , 170 ప్రకారం, ప్రతి సెన్సస్ తర్వాత నియోజకవర్గాల సంఖ్య, సరిహద్దులు, SC/ST రిజర్వేషన్లు పునర్విభజించాలి. అయితే, 1976లో 42వ రాజ్యాంగ సవరణ (ఫ్రీజ్) ద్వారా 2000 వరకు, తర్వాత 84వ , 87వ సవరణల ద్వారా 2026 వరకు ఈ ప్రక్రియను ఆపేశారు. అంటే 2026లో నియోజకవర్గాలను పునర్విభజన చేయవచ్చు.
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన
లోక్ సభ సీట్లే కాదు.. అసెంబ్లీ సీట్ల పునర్విభజన కూడా చేయనున్నారు. విభజన చట్టంలోనే ఉన్నప్పటికీ రాజ్యాంగసవరణ చేయాల్సి ఉన్నందున సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు రాజ్యాంగంలోనే అవకాశం లభిస్తోంది. 2021 సెన్సస్ కోవిడ్ వల్ల జనాభా లెక్కలు ఆలస్యమమయ్యాయి. 2026 లోనే జనాభా లెక్కలు పూర్తవుతాయి. ఈ డేటా ఆధారంగా డెలిమిటేషన్ మొదలవుతుంది. 2028 నాటికి ప్రక్రియ ముగిసే అవకాశం. డెలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు రాష్ట్రపతి చేస్తారు, ఎన్నికల కమిషన్ సహకారంతో పని చేస్తుంది.లోక్ సభ, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. సరిహద్దులు మారుతాయి.
నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలు గందరగోళం
జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలో జిల్లా అని చెప్పి చివరికి గందరగోళం చేశారు. ఇరవై జిల్లాలు ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో ఎవరికీ తెలియనంత గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు దాన్ని సరి చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం మరికొంత మారుస్తోంది . కానీ నియోజకవర్గాల పునర్విభజన చేసిన తరవాత సగం నియోజకవర్గం ఓ జిల్లాలో..మిగిలిన సగం మరో జిల్లాలో వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. జిల్లాల విభజన .. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే వరకూ కదిలించకుండా ఉండటమే బెటర్. కానీ ప్రభుత్వం మాత్రం… ఇప్పుడే పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది.
