‘బలగం’ దర్శకుడు వేణు తదుపరి సినిమాగా ‘ఎల్లమ్మ’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఏ ముహూర్తంలో మొదలెట్టారో తెలీదు కానీ.. ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముందు ఈ కథని నానికి చెప్పారు. ఆ తరవాత నితిన్ ఓకే అన్నారు. నితిన్ పక్కకు వెళ్లిపోవడంతో చాలామందికి ఈ కథ వినిపించారు. చివరికి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్సయ్యాడన్న వార్తలొచ్చాయి. ఇప్పటి వరకూ హీరో ఎవరన్న విషయంలో క్లారిటీ రాలేదు.
కథానాయిక పరిస్థితి కూడా అంతే. ముందు ఈ కథని సాయి పల్లవికి వినిపించారు. తను ఓకే అనేసింది. కానీ ఆ తరవాత పరిస్థితులు మారాయి. సాయి పల్లవి కూడా సైలెంట్ అయిపోయింది. ఆ తరవాత కీర్తి సురేష్ దగ్గరకు వెళ్లింది. హీరోలు మారుతున్నా.. హీరోయిన్గా కీర్తినే అనుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి కీర్తి కూడా బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని కీర్తీ ధృవీకరించింది కూడా. తను కథానాయికగా నటించిన ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది కీర్తి. ఈ సందర్భంగా ‘ఎల్లమ్మ’లో మీరు నటిస్తున్నారా?’ అనే ప్రశ్న కీర్తికి ఎదురైంది. దీనికి నేరుగా ‘నో’ అనే సమాధానం ఇచ్చేసింది. ఈ సినిమాలో తాను చేయడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. దాంతో.. ‘ఎల్లమ్మ’కు సంబంధించి మరో వికెట్ డౌన్ అయ్యిందనుకోవాలి. ఇప్పుడు హీరో ఫిక్స్ అయినా.. హీరోయిన్ కోసం వేట మొదలెట్టాలన్నమాట. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. డిసెంబరులో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని భావించారు. అయితే ఇప్పుడు అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.