అసలు సిసలైన ఆట టెస్ట్ క్రికెట్ లో వరుస వైట్‌వాష్‌లతో టీమ్ ఇండియా దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళింది. సొంతగడ్డపై ఏడాది వ్యవధిలో ఎదురైన రెండు ఘోర పరాభవాలు కోచ్ గౌతమ్ గంభీర్ ని కార్నర్ చేశాయి. ఇప్పుడు సోషల్ మీడియా తెరిస్తే.. గంభీర్ ని తిట్టిపోస్తున్న పోస్టులు కుప్పలుగా కనిపిస్తున్నాయి. యువరక్తం, సంస్కరణల పేరుతో గంభీర్ చేసిన ప్రయోగాల కారణంగా జట్టు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. గంభీర్ ఇండియాకు దొరికిన మరో గ్రెగ్ చాపెల్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో మరో పిడుగు లాంటి వార్త గంభీర్ నెత్తిన పడింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (781 రేటింగ్ పాయింట్లు) వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ ర్యాంక్ కు గంభీర్ కు ఏమిటి లింక్ అనే ప్రశ్న రావచ్చు. పెద్ద లింకే ఉంది. వచ్చే వరల్డ్ కప్ ఆడాలని రోహిత్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్‌లాంటి వెటరన్ క్రికెటర్ల సేవలు ఇక చాలనేది గంభీర్ భావన. చాలా తెలివిగా రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తప్పించేశాడు. అయినప్పటికీ వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న రోహిత్.. ఒక సాధారణ ఆటగాడిలా బరిలోకి దిగి పూర్తి ఫోకస్‌తో ఆడాడు. చివరి మ్యాచ్‌లో రోహిత్, విరాట్ ఇద్దరూ అదరగొట్టారు.
నిజానికి ఈ సిరీస్ విరాట్, రోహిత్‌లకు చివరిదని అనుకున్నారు. సెలెక్టర్ అజిత్ అగార్కర్, రోహిత్ ని పలుచన చేసే ఓ కామెంట్ కూడా చేశాడు. ఏదో రకంగా రోహిత్, విరాట్ ని తప్పించేలానే ఎత్తుగడ గంభీర్ నాయకత్వంలో స్పష్టంగా కనిపించింది. అలాంటిది ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలోకి వచ్చాడు రోహిత్.
ఇప్పటికే వరుస ఓటములతో గంభీర్ పై నమ్మకం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భంలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ ని పక్కన పెట్టి మరో ప్రయోగం చేస్తే గంభీర్ పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. పైగా రోహిత్, విరాట్ టెస్ట్, టీ20 ఫార్మాట్లు వదిలేశారు. కేవలం వన్డేలోనే ఆడుతున్నారు. ఈ ఇద్దరూ కూడా అన్ని దేశాలపై, అన్ని పరిస్థితుల్లో ఆడే అనుభవం, క్లాస్ ఉన్న ఆటగాళ్లు. ఇప్పుడున్న పరిస్థితిలో గంభీర్ నమ్మకున్న ఆటగాళ్ల వైఫల్యం… సీనియర్లు మళ్లీ ఫామ్ లోకి రావడంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది గంభీర్ పరిస్థితి.