2018 వచ్చిన రంగస్థలం తర్వాత పుష్ప ప్రాజెక్ట్‌లోకి వచ్చేశారు సుకుమార్. 2021లో పుష్ప వచ్చింది. 2024లో పుష్ప 2. ఇప్పుడు సుకుమార్ చేయబోయే కొత్త సినిమాలు ఫిక్స్ అయ్యాయి. రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. పెద్ది పూర్తయిన వెంటనే సెట్స్‌పైకి వెళుతుంది. రంగస్థలం తర్వాత సుక్కు–చరణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై చాలా మంచి అంచనాలు ఉన్నాయి.
చరణ్ సినిమా తర్వాత మళ్లీ అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజ్లోకి వస్తారు సుకుమార్. ఈ విషయాన్ని నిర్మాత మైత్రీ రవి ప్రకటించారు. “సుకుమార్ గారు చరణ్ గారి సినిమా చేస్తున్నాం, ఇది మంచి కాన్టెంపరరీ సబ్జెక్ట్. ఈసారి రంగస్థలాన్ని మించి ఉంటుంది. ఈ సినిమా అయిన తర్వాత 2027లో పుష్ప 3 సెట్స్‌పైకి తీసుకెళ్తాం. ఇప్పటికే సుకుమార్ గారు పుష్ప 3 వర్క్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది” అని చెప్పుకొచ్చారు.
మొత్తానికి సుకుమార్ డైరీ 2030 వరకూ ఫుల్ అయిపోయింది. పైగా ఈ పదేళ్లలో ఆయన కేవలం ఇద్దరు మెగా హీరోలతోనే వర్క్ చేయడం, అలాగే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కావడం గమనార్హం. ఒక క్రియేటర్ జీవితంలో పదేళ్లు అంటే మామూలు విషయం కాదు. చాలా మంది దర్శకులకు హీరోల సమస్య ఉంటుంది. ఒక సినిమా తర్వాత మళ్లీ ఎలాంటి కాంబినేషన్ సెట్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ సుకుమార్‌కు ఒక దశాబ్దానికి సరిపడా ప్రాజెక్టులు లాక్ అయిపోవడం విశేషమే.