నారా లోకేష్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న అంశాన్ని దారిలోకి తెచ్చేందుకు ఇప్పటికే కటువుగా మాట్లాడటం ప్రారంభించారు. తాజాగా బుధవారం పార్టీ కార్యాలయంలో రిజీనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో గ్రీవెన్స్ నిర్వహించని 23మంది ఎమ్మెల్యేల గురించి చెప్పారు. అలాగే ఇద్దరు మంత్రులు కూడా ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. వారందరికీ పార్టీ తరపున నోటీసులు పంపి సంజాయితీ తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలే ఫస్ట్ -పార్టీలోనూ అదే పాలసీ
పీపుల్స్ ఫస్ట్ అనేది ప్రభుత్వ పాలసీ. టీడీపీలోనూ అదే పాలసీని లోకేష్ అమలు చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు ముందుగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ దిశగా తమ పనితీరును మార్చుకున్న వారికే లోకేష్ వైపు నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఎమ్మెల్యేలు అయినా..మంత్రులు అయినా తాము ఇతర పనుల్లో బిజీగా ఉన్నామని చెప్పుకోవడం కాదు.. మొదట ప్రయారిటీగా ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించి పరిష్కరించడంలోనే ఉండాలని అంటున్నారు. ఆ తర్వాతే ఇతర పనులని స్పష్టం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇలా 40మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు కొంత మంది పనితీరు మార్చుకున్నారు. మిగిలిన వారిని కూడా ప్రజలకు దగ్గర చేర్చే ప్రయత్నంలో లోకేష్ ఉన్నారు.
దారి తప్పిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు షాక్ట్రీట్మెంట్లు షురూ
పార్టీ అంతర్గత విషయాలు బయటకు రాకుండా నారాలోకేష్.. అంతర్గతంగానే పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. ముఖ్యంగా మొదటి సారి ఎమ్మెల్యేలు అయి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న వారికి షాక్ ట్రీట్మెంట్లు ప్రారంభించారు. మొదటి సారి హెచ్చరికలను పట్టించుకోని వారికి నియోజకవర్గంలో ప్రాధాన్యం తగ్గించడం ప్రారంభించారు. పార్టీకి, ప్రజలకు సమయం కేటాయించలేనప్పుడు వన్ టైమ్ ఎమ్మెల్యేగా మిగిలిపోవడం మంచిదని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. లోకేష్ వద్ద చనువు ఉందని.. తమను బాగా చూసుకుంటారని అనుకుంటున్న ఎమ్మెల్యేలు ఆయన కఠినంగా వ్యవహరిస్తూండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంచిగా ఉంటున్నారని ఇష్టం వచ్చినట్లుగా చేస్తే తన మంచితనాన్ని అందుకోలేరని లోకేష్ నిరూపిస్తున్నారు.
దారికి రాని వారిపై కఠిన చర్యలు
గతంలోలా లోకేష్ నాన్చడం లేదు.బయటకు ప్రకటించకపోయినా కొంత మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే పార్టీ విశ్వాసం కోల్పోయింది. వారిని పార్టీ సభ్యులుగా సాంకేతికంగానే చూస్తున్నా.. వీలైనంత వరకూ దూరం పెడుతున్నారు. వారు ఇక మారరు అని డిసైడయ్యే ఇతర నేతల్ని ప్రోత్సహిస్తున్నారు. మంత్రుల విషయంలోనూ అలాగే వ్యవహరించాలని అనుకుంటున్నారు. కొంత మంది మంత్రులు తమ బాధ్యతల కన్నా ఇతర విషయాల్లోనే ఎక్కువ బిజీగా ఉంటున్నారు. మరో ఆరు నెలల్లో పార్టీ మొత్తాన్ని దారికి తీసుకురావాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. పార్టీ నిర్ణయించిన మేరకు.. ప్రజలకు అందుబాటులో ఉంటేనే.. పార్టీ నేతలకు భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలు గట్టిగానే పంపుతున్నారు.
