“ ముందుండి నడిపించేవాడు నాయకుడు అవుతాడు కానీ.. అందరిపై ఎక్కి కూర్చుకుని తనను ముందుకు తీసుకెళ్లమని అడిగేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు” .. ఇది కార్పొరేట్ పాఠాల్లో ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. ఇది వ్యాపార సంస్థకే కాదు.. సమాజంలో ప్రతి అంశానికి వర్తిస్తుంది. కుటుంబాన్ని.. రాజకీయ పార్టీని నడిపేవారికీ వర్తిస్తుంది. అయితే ఆ నాయకుడు అత్యంత స్వార్థపరుడు అయినప్పుడు తాను మాత్రమే బాగుపడితే చాలనుకున్నప్పుడు అతను నాయకత్వం వహించే సంస్థ, ఆయన ఆధ్వర్యంలో పని చేసే ఉద్యోగులు.. ఆయన పెద్దగా ఉన్న కుటుంబం ఏది నిలబడదు. అన్నీ విచ్చిన్నమైపోతూ ఉంటాయి. అదే సమయంలో ఆయన స్వార్థానికి ఎంతో మంది బలి అయిపోతూ ఉంటారు. అలాంటి నాయకత్వం ఎప్పటికీ విజయం సాధించదు. ఈ లక్షణాలన్నీ చెప్పుకున్న తర్వాత అందరికీ ఆంధ్రప్రదేశ్‌లో ఒకరే గుర్తుకు వస్తారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధినేత.
పార్టీ నేతల్ని పావులుగా వాడుకునే ఏకైక లీడర్
రాజకీయ పార్టీ అంటే తాను ఒక్కడే అనుకుంటారు జగన్. తన కోసమే జనం ఓట్లేస్తారని.. ఎమ్మెల్యేలు నిమిత్తమాత్రులని ఆయన అభిప్రాయం. తన పార్టీలోకి ఎవరైనా పని చేయడానికి వచ్చారంటే..తన క్రేజ్ ను అడ్డం పెట్టుకుని ఏదో పదవులు పొంది.. తర్వాత దండిగా సంపాదించుకోవడానికి వచ్చారని.. అందుకే వాళ్లను వాడుకుంటే తప్పు లేదని అనుకుంటారు. తన వాడకానికి సరిగ్గా సరిపోతే వాళ్లను మాత్రమే పార్టీలో ప్రోత్సహిస్తారు. దానికి ఉదాహరణ .. నందిగం సురేష్. అమరావతి భూసమీకరణ జరుగుతున్నప్పుడు అరటి తోటలను తగులపెట్టిన ఆయనను బాగా వాడుకోవచ్చని జగన్ భావించారు. కావాల్సిన అరాచకాలు చేయగలరు..పైగా దళిత కార్డు. ఇంకేముందని బాపట్ల ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆయన గురించి ప్రజలకు పూర్తిగా తెలియని రోజుల్లో ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు అదే నందిగం సురేష్‌ను పట్టించుకోవడం మానేశారు. ఆయనను పూర్తిగా వాడేశారు. ఇక సరుకేం లేదని చెప్పి.. కొత్త కొత్త బకరాల వైపు చూస్తున్నారు. నందిగం సురేష్ ఒక్క ఉదాహరణ మాత్రమే.. ఆయన పార్టీలో అందరూ జగన్ రెడ్డి కి అటు రాజకీయంగా.. ఇటు మానసికంగా ఉపయోగపడేవారే అయి ఉండాలి. అవసరం లేదనుకుంటే.. వెంటనే ఇంటి ఎదుట ఉన్న గార్బేజ్ తొట్టిలో క్షణంలో పడేస్తారు. దానికి విజయసాయిరెడ్డి సాక్ష్యం. జగన్ రెడ్డి ఇప్పుడు ఇంత ఆర్థిక సామ్రాజ్యం నెలకొల్పుకున్నారంటే దానికి కారణం విజయసాయిరెడ్డి. గౌరవప్రదమైన ఆయన జీవితం జగన్ రెడ్డి వల్ల పూర్తిగా రోడ్డున పడింది. పదహారు నెలలు జైల్లో ఉన్నారు. ఇంకా జైలుకెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆయనపై జగన్ అనుమానం పెంచుకుని అవసరం లేదని చెత్తబుట్టలో పడేశారు. విజయసాయిరెడ్డితో ఇక ఉపయోగం లేదనుకునే ఆ పని చేశారు. ఇక మిగిలిన నేతలు ఆయనకో లెక్క కాదు.
ఇంత మంది జైలుకెళ్తున్నారంటే కారణం జగన్ !
అధికారం అందిన తర్వాత జగన్ రెడ్డి .. ఆ అధికారంలో వాటా ఇవ్వాలంటే కొన్ని షరతులు పెట్టుకున్నారు. అదేమిటంటే తనను మానసికంగా రంజింపజేసిన చేసిన వారికి మాత్రమే అగ్రతాంబూలం ఇవ్వడం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కృష్ణా జిల్లా కాపు నేతలందర్నీ పవన్ కల్యాణ్‌ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను పేర్ని నాని .. పెద్దపాలేరునని ప్రకటించుకుని పాటించారు. ఇలాగే ఇతర నేతలు కూడా పాటించారు. కానీ జగ్గయ్యపేట నేత సామినేని ఉదయభాను మాత్రం పాటించలేదు. ఆయన పద్దతిగా రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కృష్ణా జిల్లా నుంచి మొదటి సారిగా మంత్రిగా అవకాశం ఇవ్వాల్సింది ఉదయభానుకే. కానీ పవన్ కల్యాణ్‌ను తిట్టలేదని చెప్పి ఆయనను పక్కన పెట్టేసి.. నోటి పవర్ చూపించిన కొడాలి నాని, పేర్ని నానిలకు అవకాశం ఇచ్చారు. ఆ కృతజ్ఞతతో వారు మరింత రెచ్చిపోయారు. జగన్ రెడ్డి మనస్థత్వం ఎలా ఉంటుందంటే.. వారు అలా రెచ్చిపోవడంతో ఇక ఏ పార్టీలోనూ చాన్స్ రాదు.. మన దగ్గర పడి ఉండాల్సిందేనని.. రెండున్నరేళ్ల తర్వాత వారిద్దర్నీ పీకి పడేసి.. ఆ తిట్లకు తోడు.. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లి జోగి రమేష్‌కు చాన్సిచ్చారు. ఇప్పుడు జోగి రమేష్ జైల్లో ఉన్నారు. కొడాలి నాని నోరు తెరవడం లేదు. గుండె ఆపరేషన్ అని బిక్కుబిక్కుమంటున్నారు. పేర్ని నాని అరెస్టు భయంతో ఎన్ని సార్లు కుటుంబాన్ని తీసుకుని అజ్ఞాతం పేరుతో నేపాల్‌కు పోయి వచ్చారో చెప్పాల్సిన పని లేదు. గోడౌన్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకున్న ఆయన.. ఆ గోడౌన్లను తన భార్యపై రిజిస్టర్ చేయించడంతో ఆమెకూ అరెస్టు ముప్పు తెచ్చి పెట్టారు. కానీ జగన్ రెడ్డిలా ప్రభుత్వ పెద్దలు ఆలోచించలేదు కాబట్టి ఆయన కుటుంబం నిలబడింది. లేకపోతే ఏం జరిగేదో పేర్ని నానికి బాగా తెలుసు. కానీ ఆయనకు ఎందుకలా జరిగిందో కాస్త ఆలోచించుకుంటే.. ఇదంతా జగన్ రెడ్డి వల్లే కదా అన్న విషయం తెలుస్తుంది. తెలిసి ఉంటుంది కూడా. ఒక్క కృష్ణా జిల్లా నాయకులు కాదు.. ప్రతి జిల్లాలోనూ జగన్ రెడ్డి దెబ్బకు జీవితాలను నాశనం చేసుకున్నవారు కనిపిస్తారు. గోరంట్ల మాధవ్ అనే సీఐ.. జేసీ దివాకర్ రెడ్డి మీద తొడ కొట్టారని పిలిచి టిక్కెట్ ఇచ్చారు. ఒక్క సారి గెలిచారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్నారు. తర్వాత టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అసలు పట్టించుకునేవారు. ఉద్యోగం లేదు. పార్టీలో పట్టించుకోరు కానీ జగన్ ఆయనను వాడుకున్న విధానంతో ఆయన అందరికీ శత్రువయ్యారు. పరువు పోయింది. ఇప్పుడు ఆయన బతుకేందో ఆయనకే తెలియడం లేదు. ఇలా ఎంత మంది ఉన్నారో లెక్కలేసుకుంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల్ని వెదుక్కున్నట్లే. ఎందుకంటే జగన్ రెడ్డి ఇలాంటి బకరాలను మాత్రమే ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తారు. కాస్త ప్రజాబలం తెచ్చుకుంటున్నారు అంటే.. వెంటనే శంకరగిరి మాన్యాలకు పట్టించే ప్లాన్లను అమలు చేస్తారు. పార్టీ కోసం బూతులు తిట్టలేరా.. విపక్ష సభ్యులను కొట్టలేరా అన్న ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్.. పదవుల ఆశ వారిని తప్పుడు మార్గంలో వెళ్లేలా చేస్తాయి. చివరికి వారు ఎక్కడ తేలుతారో చెప్పడం కష్టం.
జగన్ రెడ్డి వాడకాన్ని అంచనా వేయడం కష్టం
జగన్ రెడ్డి వాడకానికి బహుముఖాలుంటాయి. కేవలం తిట్లు తిట్టించి.. విపక్ష నేతలపై దాడులు చేయించి వారి జీవితాల్ని బుగ్గి పాలు చేయరు. మరో పార్టీలోకి వెళ్లకుండా చేస్తారు. అక్కడి వరకూ ఉంటే పర్వాలేదు కానీ వాళ్లను అడ్డం పెట్టుకుని.. వాళ్ల పేరు మీద స్కాములు చేస్తారు. ఆ డబ్బంతా తన బొక్కసానికి పంపించుకుంటారు..కానీ ఆ లీడర్లు మాత్రం బొక్కలోకి పోతారు. ఇక్కడ లీడర్లు మాత్రమే కాదు.. అధికారులు కూడా ఉంటారు. ఇప్పుడు తిరుమలలో జరుగిన లడ్డూ కల్తీ నెయ్యి, పరకామణి దొంగతనం కేసులపై జైలుకెళ్లిన వారు ఎవరు.. వెళ్లబోతున్నవారు ఎవరు ..?. వారేం చేశారు.. వారి వెనుక ఉన్నది ఎవరు అని వైసీపీలో అంతర్గతంగా చాలా మందికి తెలుసు. చిన్న అప్పన్న అనే చిన్న వ్యక్తి టీటీడీ నెయ్యిని సరఫరాదారును ఎలా మార్చగలరు?. ఆయనకు టీటీడీలో పదవి లేదు. కానీ ఆయన జగన్ రెడ్డి నియమించిన అనేక మంది సలహాదారులలో ఒకరు. ఎందుకు ఆ పదవి ఇచ్చారో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. తనకేం సంబంధం లేదని సుబ్బారెడ్డి గగ్గోలు పెడుతున్నారు. కానీ జగన్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతీసి డబ్బులు సంపాదించుకుంటే తాను బలవుతున్నానని ఆయనకు బాగా తెలుసు. ఆయన తప్పించుకోలేరు ఎందుకంటే ఆయనకూ కొంత కమిషన్ ముట్టింది కాబట్టి. జగన్ రెడ్డి అలా ఇరికిస్తారు..ఎవరూ తప్పించుకోలేని విధంగా. అందుకే కల్తీ నెయ్యి విషయంలో టీటీడీలో తప్పు జరిగిందేమో .. మా దృష్టికి రాలేదు అని చెప్పి తప్పించుకోకుండా.. అసలు కల్తీ జరగలేదని వాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరకామణి కేసులోనూ అంతే. దేవుడ్నే వదల్లేదు అంటే.. ఇతర అంశాల్లో ఇంకెలా చేసి ఉంటారో ఊహించడం కష్టమేం కాదు. ఈ వాడకంలో ఆశపడిన అధికారుల్ని ఎలా పిండేశారో కూడా మనం చూస్తున్నాం.
ఎన్ని వేల కోట్లు ఉన్నా పిల్లికిబిచ్చం పెట్టని తత్వం
పార్టీ నేతల్ని జగన్ ఎలా వాడుకుంటారు?. ప్రజా రాజకీయాలు చేయడానికి వాడుకుంటారా అని ఆలోచిస్తే.. అసలు జగన్ రాజకీయంలో అలాంటి వాటికి చోటే లేదు. ప్రజలకు మంచి చేయాలని ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పరు. సాక్షి పత్రికలో మాత్రమే చెబుతారు. ఆ పత్రికలోనే వస్తుంది. ఆ పార్టీ సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేసుకుంటారు. నిజం మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. విజయవాడ వరదలప్పుడు రూ. కోటి ప్రకటించారు. అది ప్రభుత్వానికి ఇవ్వడం ఇష్టం లేదు..మేమే పంచుతారం అని.. రెండు ఆటోల్లో ఓ పది , ఇరవై బియ్యం బస్తాలేసుకుని వీధుల్లో తిరిగి ఎవరికో ఇస్తున్నట్లుగా వీడియోలు తీసుకున్నారు. ఆ కోటి రూపాయల పని అయిపోయింది. ప్రచారం మాత్రం చేసుకున్నారు. హుదూద్ వచ్చినప్పుడూ అంతే. అంత ఎందుకు.. జగన్ రెడ్డికి కళ్లు తిరిగిపోయేంత సంపద ఉంది. ఎప్పుడైనా.. పులివెందుల ప్రజలకు అయినా అయ్యా అనారోగ్యం అని వచ్చిన వారికి ఎవరికైనా ఒక్క రూపాయి సాయం చేసినట్లుగా రికార్డు లేదు. ఎప్పుడైనా సాయం చేయాలి అనిపిస్తే.. పార్టీ నేతల మీద రుద్దేస్తారు. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన సైనికుడు పాకిస్తాన్ తో ఉద్రిక్తతల సమయంలో అమరవీరుడయ్యాడు. ఆయనను పరామర్శించేదుకు అన్ని పార్టీల నేతుల వెళ్తున్నారని జగన్ కూడా వెళ్లారు. అక్కడ ఆర్థిక సాయం ఇరవై లక్షలు ప్రకటించారు. ఆ పది రోజుల వరకూ ఆ కుటుంబానికి చేరలేదు. సోషల్ మీడియాలో ప్రశ్నలు ప్రారంభం కాగానే.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌తో ఆ డబ్బు ఇప్పించారు. కానీ జగన్ రెడ్డి ఇవ్వలేదు. పార్టీ తరపున కూడా ఇవ్వలేదు. ఎవరికైనా సాయం చేయాలంటే ఆయనకు చేతులు రావు. పబ్లిసిటీ కోసం సాయం చేయాల్సి వస్తే.. ఆ భారం పార్టీ నేతల మీదకు నెట్టేస్తారు. ఇక్కడ అసలు విషయం గుర్తించాలి.. అదేమిటంటే.. జగన్ అధికారంలోకి వస్తే ఈ పార్టీ నేతలెవరికీ ఆదాయాలు ఉండవు. జగన్ ఒక్కడే సంపాదించుకుంటారు. “ గతంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఆర్థికంగా బలపడేందుకు ఇసుక ఉపయోగపడేది…కానీ ఇప్పుడు ఒక్క జగన్ మాత్రమే సంపాదించుకుంటున్నారు” అని జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు. పార్టీ నేతల్ని బలపరిస్తేనే పార్టీ బలంగా ఉంటుందన్న సలహాలను తన మాటల ద్వారా జగన్ చెప్పారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి మద్యం నుంచి ఇసుక వరకూ.. వ్యవస్థీకృతంగా పార్టీ నేతలకు కూడా చాన్సివ్వకుండా తానే దోచుకున్నారు. మద్యంలో ఆయన దోచుకున్న వైనం చూసి.. వైసీపీ నేతలకూ దిమ్మతిరిగిపోయి ఉంటుంది. విదిల్చే చిల్లర కోసం దాంట్లో భాగం కానందుకు వారు ఇప్పుడు సంతోషపడుతూ ఉంటారు. అంటే.. ఖర్చు మొత్తం తన పార్టీ నేతలది.. అధికారం వస్తే సంపాదన ఆయనది. కానీ కేసులు, జైళ్లు మాత్రం కమిషన్ల కోసం కక్కుర్తి పడి.. ఆ స్కామ్‌లలో చిన్న పాత్రధారిగా మారిన వారిది.
జగన్ రెడ్డి ఓ పొలిటికల్ డ్రాక్యులా లాంటి నేత. ఆయన నీడలో నిలబడితే పూర్తిగా తన మానసిక ఆనందం కోసం, తన దోపిడీల కోసం.. తన రాజకీయాల కోసం మొత్తం రక్తాన్ని పీల్చి పడేస్తారు. ఆ విషయం శ్రీలక్ష్మి నుంచి సునీల్ కుమార్ వరకూ సివిల్స్ సర్వీస్ అధికారులకు తెలుసు.. విజయసాయిరెడ్డి నుంచి జోగి రమేష్ వరకూ పార్టీ నేతలకూ తెలుసు. కానీ అందరూ కక్కుర్తి పడిన వాళ్లే కాబట్టి కిక్కురమనలేరు. అలా ఇరికించడంలో జగన్ రెడ్డి ప్రత్యేకతే వేరు. అందుకే ఆయన నీడలోకి వెళ్లాలనుకునేవారు ఆలోచించుకోవాల్సిందే.. నేతలైనా .. ప్రజలైనాసరే !