కాంక్రీట్ జంగిల్స్ లో ఉంటున్నాం కాబట్టి ఇక అగ్నిప్రమాదాలనే మాట ఉండవని అనుకుంటూ ఉంటారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అగ్నిప్రమాదం జరిగితే కాంక్రీట్ జంగిల్ కూడా మండిపోతోంది. హాంకాంగ్‌లో ఓ కమ్యూనిటీలో ఎనిమిది స్క్రైస్కాపర్ అపార్టుమెంట్లు ఉన్నాయి. ఓ అపార్టుమెంట్ లో చెలరేగిన మంటలు అన్నింటికీ వ్యాపించి బుగ్గి అయిపోయింది. ఎంత మంది చనిపోయారో కూడా లెక్క తేలడం లేదు. ఆ దృశ్యాలు చూసిన వారికి ఆకాశహర్మ్యాలంటే భయం పుడుతుంది.
హైదరాబాద్‌లో ఇప్పుడు స్కై స్క్రాపర్ల ట్రెండ్ నడుస్తోంది. కడితే కనీసం ముఫ్పై అంతస్తులు ఉండాల్సిందేనన్నట్లుగా నిర్మిస్తున్నారు. యాభై,అరవై అంతస్తులు కామన్ అయిపోయింది. కానీ విపత్తు వస్తే మాత్రం ఇలాంటి నిర్మాణాల వల్ల ప్రాణనష్టం విపరీతంగా జరుగుతుంది. ఓ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి దాన్ని కంట్రోల్ చేయకపోతే.. ఆ కమ్యూనిటీ మొత్తం తగలబడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి హాంకాంగ్ అగ్నిప్రమాదమే సాక్ష్యం. ఎంత ఫైర్ సేప్టీ ఏర్పాట్లు ఉన్నా…. బయటకు రావడం ఎలా సాధ్యం ?
హాంకాంగ్ స్కై స్క్రాపర్లు బుగ్గి కావడానికి కారణం రిపేర్ల కోసం అపార్టుమెంట్ చుట్టూ వెదురుకర్రలతో దడి కట్టారు. వాటికి నిప్పు అంటుకుని మొత్తం అపార్టుమెంట్లకు అంటుకుంది. అలాగే అంటుకోవాలని లేదు.. కొన్నాళ్ల కిందట.. నల్లగండ్లలోని ఓ ప్రముఖ కమ్యూనిటీ అపార్టుమెంట్ ఫ్లాట్ లో అగ్నిప్రమాదం జరిగి మూడు, నాలుగు అంతస్తుల వరకూ అంటుకుంది. ఆ ప్రమాద తీవ్రత తక్కువే కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా సమస్య అయ్యేది. హాంకాంగ్ ప్రమాదం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది.