మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో మే 24న టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ప్రోత్సాహమే కారణం అని పోలీసులు గుర్తించారు.
రెస్టారెంట్లో జరిగిన మీటింగ్లు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా వారి పాత్రను నిర్దారించారు. టీడీపీ అంతర్గత విబేధాల వల్లే హత్య జరిగిందని కనిపించేలా హంతకుల్ని పార్టీ మార్పించారు. హత్యకు వాడిన వాహనాలపై టీడీపీ గుర్తులు వేయించారు. కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ పిటిషన్ తిరస్కరణకు గురయింది.
ఆ తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 4న మధ్యంతర రిలీఫ్ ఇచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ ఇచ్చి, రెస్పాండెంట్లకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 27న బ్రదర్స్ మచేర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. లొంగిపోయేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. లొంగిపోయిన తర్వాత వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంది.