అమరావతిలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ీ సందర్భంగా అమరావతిలో మరోసారి సందడి వాతావరణం ఏర్పడింది. ఆర్బీఐ, ఎస్బీఐ సహా అన్ని బ్యాంకులు, ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకే చోట రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు నిర్మిస్తాయి. రాజధాని నిర్మాణానికి మోదీ సహకరిస్తున్నారని చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని బ్యాంకులు వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నాయి. ఇప్పటికే తమ స్థలాలను క్లీన్ చేసుకుని హద్దులుగా రేకులు పెట్టుకున్నారు.
గురువారమే అమరావతిలో తిరుమల శ్రీనివాసుడి ఆలయ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. తిరుమల ఆలయం స్థాయిలో భారీగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో ఎక్కడ చూసినా నిర్మాణాలే కనిపిస్తున్నాయి. పన్నెండు వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. నిరంతరం భారీ యంత్రాలు తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద వాహనాలతో మెటీరియల్ తరలిస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులోనూ పనులు జరుగుతున్నాయి. ఒక్క రోజు కూడా పని ఆగడానికి లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆర్థిక రాజధానిగా అమరావతి ఇప్పుడు మారుతోంది. అక్కడ వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. అక్కడ నిర్మాణ సంస్థలు ఎంత ఖర్చు పెడితే.. వాటిలో ముఫ్పై శాతం వరకూ పన్నుల రూపంలో ప్రభుత్వానికే వస్తాయి. ఉపాధి కోసం పదివేల మంది అమరావతికి రావడంతో వారి కోసం నివాసం, ఇతర అవసరాల వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఐదేళ్ల కిందటి నాటి పరిస్థితి కనిపిస్తూండటంతో .. అమరావతి ప్రాంతానికి కళ వచ్చినట్లయింది.