తెలంగాణ ప్రభుత్వం ఔటర్ లోపల నిరుపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములు, కాలుష్య కారక పరిశ్రమల తరలిస్తే ఖాళీగా ఉండే భూముల విషయంలో ఇటీవల హిల్ట్ అనే పాలసీ తీసుకు వచ్చింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP)-2025’ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మంచి అవకాశం అని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్ లోపలి, సమీపంలో ఉన్న 9,292 ఎకరాల పాత ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను రెసిడెన్షియల్, కమర్షియల్, IT, మల్టీ-యూజ్ జోన్లుగా మార్చేందుకు ఈ పాలసీ అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రానికి భారీ రెవెన్యూతో భూమి అందుబాటులోకి రావడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇళ్ల ధరలను తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 50-60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలోకి చేరాయి. ఇవి కాలుష్యం కారకంగా మారాయి. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్‌ను మల్టీ-యూజ్‌గా మార్చాలని నిర్ణయించింది.
ఈ పాలసీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు గేమ్-చేంజర్ గా మారనుందని నిపుణులు అంచనా. పాత ఇండస్ట్రియల్ ఏరియాలు కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు మారతాయి. కొత్త లాంచెస్ పెరుగుతాయి. దీని వల్ల ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈ పాలసీతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025-26లో బలంగా రికవర్ అవుతుందని అంచనా. మధ్యతరగతి హౌసింగ్ కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కు తగ్గ సప్లయి మాత్రమే లేదు. హిల్ట్ పాలసీతో అది తీరితే .. హైదరాబాద్ మరింత అఫోర్డబుల్‌గా మారుతుంది.
