ప్రేమకథల్లో ప్రధాన విలన్ కులమే. సమాజం ఎంత మారినా.. ఈ కులం విలన్ గా ఉండే ప్రేమ కథలు మాత్రం ఆగడంలేదు. మహారాష్ట్రంలో ఓ జంటను ఈ కులం అనే కారణంగా విడదీయడానికి ప్రేమికుడ్ని చంపేశారు అమ్మాయి తల్లిదండ్రులు. కానీ ఆ అమ్మాయి మమ్మల్ని విడదీయలేరు అని నిరూపించేందుకు మృతదేహన్నే పెళ్లి చేసుకుంది.
నాందేడ్ జిల్లాలో అంచల్ అనే యువతి, సాక్షిం అనే యువకుడు ప్రేమించుకున్నారు. మూడేళ్ల పాటు వారి ప్రేమ కొనసాగింది కానీ వారి పెళ్లికి కులమతాలు అడ్డు వచ్చాయి. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంచల్ తండ్రి, ఇద్దరు అన్నలు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. మూడురోజుల కిందట అంచల్ అన్నలిద్దరూ కలిసి సాక్షింపై దాడిచేశారు. రాళ్లతో కొట్టిచంపేశారు. పోలీసులు అంచల్ తండ్రితో పాటు అన్నలిద్దర్ని అరెస్టు చేసారు. హత్య కేసు పెట్టారు.
తన జీవితభాగస్వామిని తండ్రి, అన్నలు హత్య చేశారని తెలుసుకున్న అంచల్ చివరికి కీలక నిర్ణయం తీసుకుంది. సాక్షిం అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లింది. మృతదేహానికి పసుపు రాసింది, కుంకుమ బొట్టు పెట్టింది, తన నుదుటిపై కూడా కుంకుమ పెట్టుకుంది. నేను నీ భార్యనే… ఇప్పుడు కూడా నిన్నే పెళ్లి చేసుకుంటున్నానని గట్టిగా అరచి చెప్పింది. ఈ దృశ్యం అక్కడ ఉన్న అందర్నీ కంట తడి పెట్టించింది.
నా తండ్రి, అన్నలు సాక్షింని చంపేశారు కానీ… నా ప్రేమను చంపలేకపోయారని.. నేను జీవితాంతం సాక్షిం ఇంట్లోనే ఉంటాను. అతని అమ్మ-నాన్నకు కోడలిగానే ఉంటానని ఆమె ప్రకటించింది. సాక్షిం తల్లిదండ్రులు కూడా అంచల్ని ఒడిలో పెట్టుకుని మా కోడలే అని అంగీకరించారు. ఇక్కడ అంచల్ ప్రేమ గెలిచింది.. కానీ ఓ ప్రాణం పోయింది. ఇలాంటి విషాల ప్రేమ కథ సినిమాల్లోనూ వచ్చి ఉండదు.
