2025 ముగింపుకి వచ్చేశాం. ఈ యేడాది చివరి చాప్టర్ ఇది. డిసెంబరులో కూడా చాలా సినిమాలు వరుస కట్టాయి. అయితే వీటిలో అందరి దృష్టీ… `అఖండ 2`పైనే. ఈనెల 5న అఖండ ఈ రాబోతోంది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది. వీరిద్దరి కలయిక అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింహా, లెజెండ్, అఖండ.. ఇలా వరుస విజయాలతో చరిత్ర సృష్టించిన కాంబినేషన్ ఇది. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి సిద్ధం అవుతున్నారు. అఖండ 2 ప్రాజెక్ట్ ప్రకటించగానే.. అంచనాలు మొదలైపోయాయి. అవి రోజు రోజుకీ పెరుగుతూ పోతున్నాయి.
బాక్సాఫీసు ముందుకు ఓ మాస్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. పైగా ఇది బాలయ్య సినిమా. ఈమధ్య వరుస విజయాలతో బాలయ్య కెరీర్ మంచి జోరు మీద సాగుతోంది. బోయపాటి బాలయ్యని ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వీటన్నింటిలోనూ మాస్ అంశాల్ని పుష్కలంగా మేళవించారు. విజువల్స్ కూడా భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక వైబ్స్ బాగా కనిపిస్తున్నాయి. రిలీజ్ ట్రైలర్ లో చూపించిన హనుమంతుడి షాట్ గురించి ప్రత్యేకంగా చర్చించుకొంటున్నారు. ఇవన్నీ మాస్ ని థియేటర్లకు రప్పించే అంశాలే.
అఖండ 2కి బాక్సాఫీసు దగ్గర పోటీ లేదు. సోలో రిలీజ్. దానికి తోడు ప్రీమియర్లు పడబోతున్నాయి. అదనపు షోలకు, రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఎలాగూ వస్తాయి. కాబట్టి తొలి మూడు రోజుల వసూళ్లు భారీగా కనిపించే ఛాన్స్ వుంది. పాన్ ఇండియాని టార్గెట్ చేసిన సినిమా ఇది. తెలుగులో వసూళ్లకు కొదవ ఉండదు. మిగిలిన చోట్ల కలక్షన్లు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరమైన అంశం. మొత్తానికి అఖండ 2కి అన్నీ కలిసొచ్చేస్తున్నాయి. హిట్ టాక్ కూడా వచ్చేస్తే – బాలయ్య ఫ్యాన్స్ సంబరాలకు హద్దు ఉండదు.