భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ … కాంగ్రెస్ హైకమాండ్‌కు అదే పనిగా లేఖలు రాస్తూంటారు. ట్వీట్లు ట్యాగ్ చేస్తూంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఆయన అదే పనిగా విజ్ఞప్తులు లాంటి ఫిర్యాదులు చేస్తూంటారు. అన్నీ రేవంత్ రెడ్డి మీదనే. తాజాగా ఆయన హిల్ట్ పాలసీపైనా ఇదే విధంగా ఫిర్యాదు చేశారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఆయనేమైనా కాంగ్రెస్ నేత అనుకుంటున్నారా అని సెటైర్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే తమ పార్టీ నేతలపై రాహుల్ కు.. కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు చేస్తారు కానీ ఇతర పార్టీల నేతలు చేయరు. అలా చేస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది కాబట్టి చేయరు.
రేవంత్‌పై రాహుల్ కు ఫిర్యాదులు – ఓ విచిత్రమైన స్ట్రాటజీ
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి . ఓ కీలక రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్నారు. కేటీఆర్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత. మీ ప్రభుత్వం తప్పు చేస్తోందని అధికార పార్టీ పై స్థాయి నేతకు లేఖ రాస్తే.. ఆయన నమ్మేసి.. రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారా?. ఆ లేఖ నిజంగా ఆయన కు చేరి చదివితే సన్నగా నవ్వుకుంటారు. ఆ మాత్రం రాజకీయం తెలియకుండా ఆయన అక్కడ ఉండలేరు. తమ పార్టీ ముఖ్యమంత్రినే ఆయన నమ్ముతారు కానీ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని.. ప్రజల్లో బ్యాడ్ చేయాలని ప్రయత్నించే వారిని నమ్ముతారా?
కాంగ్రెస్ వేరు.. రేవంత్ వేరా ?
తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సీఎంగా ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు. నాయకుడు ఆయన కావొచ్చు కానీ.. హైకమాండ్ ఆలోచన మేరకే.. ఆదేశాల మేరకే అందరూ పదవుల్లో ఉన్నారు. అలాంటప్పుడు.. ఆ పార్టీని తప్పు పడుతూ ఆ పార్టీ పెద్ద నేతలకు లేఖ రాయడం అంటే.. తెలివి తక్కువ రాజకీయం అవుతుంది. అయితే కేటీఆర్ చాలా కాలంగా చేస్తున్న రాజకీయం ప్రకారం.. రేవంత్ పై అపనమ్మకం సృష్టించగే ప్రయత్నమే. అలా చేయగలిగితే చాలు.. కాంగ్రెస్ దానంతటకు అదే కూలిపోతుందని గట్టిగా నమ్ముతారు. అందకే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వకుండా ఎన్నో సార్లు అరెస్టు చేశారు. పీసీసీ చీఫ్ అయ్యాక గాంధీభవన్ గాడ్సే అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ రాహుల్ రేవంత్ పై నమ్మకం మరింత పెంచుకుంటూనే ఉన్నారు. ఆ విషయం కేటీఆర్ కు అర్థం కావడంలేదు.
రేవంత్ పై వ్యతిరేక ప్రచారంతో కేటీఆర్ స్వయం సంతృప్తి
రేవంత్ ను హైకమాండ్ నమ్మడం లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని కేటీఆర్ సంతృప్తి పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఫోటోలు దిగడం లేదని అదనీ..ఇదనీ చెబుతూనే ఉన్నారు. పదవిని మార్చే్తారని కూడా చెప్పుకున్నారు. ఇవన్నీ వారిని సంతృప్తి పరుస్తున్నాయి కానీ వాస్తవ రాజకీయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి రాజకీయాల వల్ల కేటీఆర్ ..తమను తాము మోసం చేసుకుంటున్నారు కానీ.. నిజానికి జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం ఆయన అంచనా వేయలేకపోతున్నారు. అలా వాస్తవంలోకి వస్తే.. రాహుల్ కు ఫిర్యాదులు చేయాలన్న ఆలోచన చేయరు.
