రవితేజ సినిమా అంటే హీరోయిన్ల జోరు ఎక్కువగా కనిపిస్తుంటుంది. మామూలుగా అయితే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. సంక్రాంతికి రాబోతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. కథ సిద్ధమైపోయింది. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు ఉంటారని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఎప్పుడైతే.. ఆరుగురు హీరోయిన్ల వార్త బయటకు వచ్చిందో.. అప్పటి నుంచే రకరకాల కామెంట్లు వినిపించడం మొదలైపోయింది. రవితేజ సినిమాలో కథలో ట్విస్టుల కంటే, కథానాయికలే ఎక్కువ అంటూ ఫ్యాన్స్ కూడా జోకులు వేసుకొంటున్నారు.
శివ నిర్వాణ ఈసారి ఓ ఫ్యామిలీ డ్రామా రాసుకొన్నాడట. అందులో అమ్మాయి పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. ఆరుగురిలో ఒకరిద్దరు స్టార్ హీరోయిన్లు ఉండే అవకాశం ఉంది. సమంత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిగిలిన వాళ్లంతా గెస్ట్ రోల్స్ రూపంలో ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే అవకాశం ఉంది. శివ నిర్వాణకు కూడా ఓ హిట్టు చాలా అవసరం. విజయ్ దేవరకొండతో రూపొందించిన ‘ఖుషి’ అనుకొన్న స్థాయిలో ఆడలేదు. దాంతో ఆయనకు కమర్షియల్ గా ఓ హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. రవితేజ కెరీర్ కూడా చాలా డల్ గా ఉంది. త్వరలో రాబోతున్న ‘భర్త మహాశయులకు..’ పై హోప్స్ పెట్టుకొన్నాడు. తన ఇమేజ్ కు భిన్నమైన కథలో ఆయన కనిపించబోతున్నాడు. సంక్రాంతి తరవాతే.. శివ నిర్వాణ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం వుంది.
