మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. హోంమంత్రి అమిత్ షాను కలిశారు. పార్టీ ఎంపీలతో పాటు ఈ సమావేశంలో ఏపీ హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. తుపాను నష్టంపై వివరాలు అందించడానికి ఈ సమావేశం జరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి కానీ.. అంతకు మించిన ఎజెండా ఉందని ఏపీ రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పంట నష్టపరిహారం అంచనాలను ఆమోదించేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కాదు. అయినా కేంద్రంలో పవర్ ఫుల్ రోల్ లో ఉన్నారు కాబట్టి అమిత్ షాకు ఆ అంశంపై విన్నవించుకున్నారని అనుకోవచ్చు. అయితే హోంమంత్రి అనిత ఎందుకు ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఏపీలో ప్రస్తుతం వైసీపీ నేతల చేసిన అక్రమాల కేసుల్లో విచారణకు చివరి దశకు వస్తున్నాయి. ముఖ్యంగా కల్తీ నెయ్యి కేసు, పరకామణి కేసు, లిక్కర్ కేసుల్లో అసలు సూత్రధారులెవరో బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే దర్యాప్తు వర్గాలకు ఓ క్లారిటీ వచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలంటే.. కేంద్రానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని.. ఈ అంశంపైనే అనిత కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారని అంటున్నారు.
అసలు నిందితుల్ని పట్టుకోకపోతే ఇంత కాలం జరిగిన జరిగిన దర్యాప్తునకు అర్థం ఉండదు. అసలు సూత్రధారి నేరగాడు.. మిగతా అంతా చిల్లర కోసం ఆశపడిన బకరాలే. వారందర్నీ పట్టుకుని అసలు సూత్రధారిని రాజకీయ కారణాలతో వదిలి పెట్టలేరు. ఏడాదిన్నర అవుతున్నందున ఇప్పుడు కఠిన చర్యలకు సమయం ఆసన్నమయిందని భావిస్తున్నారు.
