సినీ కార్మికుల సంక్షేమం పేరుతో నీతులు వల్లించే తమ్మారెడ్డి భరద్వాజ వారి సొమ్ము దిగమింగినట్లుగా ప్రభుత్వానికి నివేదిక అందింది. హైదరాబాద్ చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి చేసిన గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2005 నుంచి 2020 వరకూ జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ జరిపింది. నవంబర్ 27న ప్రభుత్వానికి అందిన నివేదిక అందింది.
మొత్తంగా అక్రమాలకు 15 మందిని బాధ్యులనుచేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలింది. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన.. పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే నివేదికలో బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద..
వల్లభనేని అనిల్‌తో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. వీరి వద్ద నుంచి రూ.43.78 కోట్లతో పాటు అదనంగా 18శాతం వసూలు చేయాలని నివేదికలో సిపారసు చేశారు.
చిత్రపురి కాలనీలో అక్రమాలపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది సొసైటీని గుప్పిట పట్టుకుని నిధులను దుర్వినియోగం చేశారు. సొంత అవసరాలకు వాడుకున్నారు. ఇప్పుడు అలాంటి వారందరి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రిపోర్టు పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కీలకం. ఇటీవల సినీ కార్మికుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
