ఇప్పటికే 2026 సంక్రాంతి క్యాలెండర్ ఫుల్ అయిపోయింది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పొలిశెట్టి సినిమాలు ఈ సీజన్లో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యాయి. రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఆరు చిత్రాలన్నమాట. జనవరి 9న రాజాసాబ్, 14న అనగనగా ఒక రాజు వస్తున్నాయి. 12న చిరంజీవి సినిమా ఉండొచ్చు. 13న రవితేజ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
అయితే.. వీటి మధ్య శర్వానంద్ కూడా బరిలోకి దిగడానికి తహతహలాడుతున్నాడు. శర్వా సినిమా `నారీ నారీ నడుమ మురారి`ని కూడా పొంగల్ బరిలో దించడానికి చూస్తున్నారు నిర్మాతలు. నిజానికి ఈ సినిమాని సంక్రాంతి సీజన్‌ని లక్ష్యంగా చేసుకొనే మొదలెట్టారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి పండక్కి ఇలాంటి సినిమాలకు గిరాకీ ఉంటుంది కాబట్టి నిర్మాతలు బలంగా డిసైడ్ అయ్యారు. కానీ… పండక్కి ఆరు సినిమాలు వస్తున్నాయి. ఏడో సినిమాకు చోటు దొరుకుతుందా, లేదా? అనే డౌటుతో శర్వా సినిమాని పక్కన పెట్టారు. కానీ ఇప్పుడెందుకో మళ్లీ ఈ ప్రాజెక్ట్ ని పండక్కి రెడీ చేయడానికి సన్నాహాలు మొదలెట్టారు. మీడియం రేంజు సినిమానే అయినా, థియేటర్లు పెద్దగా దొరికే అవకాశం లేకున్నా.. టాక్ బాగుంటే, జనం థియేటర్లకు వస్తారన్న నమ్మకం మేకర్స్‌కి వుంది.
పైగా సంక్రాంతి సీజన్ శర్వాకి బాగానే కలిసొచ్చింది. రన్ రాజా రన్, శతమానం భవతి సంక్రాంతి సీజన్లోనే విడుదలయ్యాయి. మంచి విజయాల్ని అందుకొన్నాయి. ముఖ్యంగా ‘శతమానం భవతి’ పెద్ద సినిమాలతో పోటీ పడి గొప్ప వసూళ్లు రాబట్టింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు నారీ నారీని బరిలో దించుతున్నారు. శర్వా ‘బైకర్’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈనెలలోనే ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. అంటే శర్వా నుంచి నెల రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలు రాబోతున్నాయన్నమాట.
