రాజకీయాల్లో యాక్సిడెంటల్‌గా ఏ పరిణామాలూ జరగవు. చాలా ప్లాన్డ్ గానే జరుగుతాయి. యాక్సిడెంటర్ గా జరిగే పరిణామాలకు అంత ఎపెక్ట్ రాదు. ప్రస్తుతం తెలంగాణలో క్రమంలో ఓ రకమైన రాజకీయ వాతావరణం ఏర్పడుతోంది. కొంత కాలం నుంచి జరుగుతున్న రాజకీయాలను చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా హిందూత్వ వాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఇతర అంశాలపై డైవర్ట్ కావడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీకి కొన్ని ఆయుధాలు అందిస్తోంది. ఇదే అసలు రాజకీయం అనుకోవచ్చు. రాను రాను తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మార్చే రాజకీయంలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్న భావన పెరుగుతోంది.
భావోద్వేగాలే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ఫ్యాక్టర్స్
ప్రస్తుత భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలత అనే పారామీటర్స్ కన్నా.. అంతర్లీనంగా ఓ భావోద్వేగం విజయానికి, అపజయానికి మధ్య గీతలా కనిపిస్తోంది. అలాంటి భావోద్వేగాన్ని పట్టుకున్నవారిదే విజయం అందుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక పని చేసిన భావోద్వేగం.. సానుభూతి. తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడం ఏమిటి .. ఆ పార్టీని నడిపించేందుకు మంచి నాయకత్వం కూడా ఉందన్న కారణంగా విజయం లభించింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది పని చేయదు. అంతకు మించిన అంశం కావాలి. అందుకే కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అనుకోవచ్చు.
హిందూ రాజకీయాలను పెంచేందుకు బీజేపీకి అవకాశాలు
తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉందని బండి సంజయ్ నాయకత్వంలో జరిగిన మార్పులే నిరూపించాయి. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పక్కా హిందుత్వ వాదంతో బీజేపీ గ్రాఫ్ పెంచుకుంది. తర్వాత వెనుకబడింది. ఇప్పుడు బీజేపీకి అలాంటి అవకాశాలను ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇటీవల కొన్ని హిందూత్వ అంశాల్లో బీజేపీ యాక్టివ్ కావడానికి అవకాశం కల్పిస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం అనుకోవచ్చు. బీజేపీ ఇలాంటి అవకాశాలను పక్కాగా వినియోగించుకుంటుంది. ఇన్ స్టంట్ రిజల్ట్స్ రాకపోవచ్చు కానీ .. ప్రజల్లో చాలా వేగంగా తన భావజాలాన్ని వేగంగా వ్యాపింప చేయగలదు. బీజేపీ ఈ భావజాలంతో పెరిగిందంటే… వారిని వ్యతిరేకించే వారంతా ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వైపు వస్తారు. అలాంటి భావజాలాల పోరాటం జరిగితే.. హోరాహోరీగా ముఖాముఖి పోరు ఉంటుంది.
బీఆర్ఎస్ ముప్పు గుర్తించింది.. అందుకే పాత ఆయుధం బయటకు !
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భావోద్వేగ రాజకీయాల మధ్య తాను నలిగిపోతానని గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ తన భావోద్వేగ ఆయుధం తెలంగాణను బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ భావోద్వేగం పవర్ ఎంత ఉంటుందో అంచనా వేయడం కష్టం. అయినా బీఆర్ఎస్ పార్టీకి మరో దారి లేదు. అందుకే తన ప్రయత్నాలు తాను చేస్తోంది. కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తే.. వచ్చే ఏడాదిలో తెలంగాణ రాజకీయం అంతా.. హిందూత్వ వర్సెస్ సెక్యులర్ అన్నట్లుగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ ఉనికి కష్టంగా మారుతుంది.
