తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత సున్నిత సమాచారం తెలుసుకునే యాక్సెస్ ఉన్న సీఎం రేవంత్ బాగా నమ్మిన వ్యక్తి అతి పెద్ద కోవర్టుగా బయటపడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీక్రెట్ గా నిర్వహించిన విజిలెన్స్ దర్యాప్తులో ఆ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు.ఇప్పుడు అతన్ని ఏం చేయాలన్నది సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తిని నమ్మి ప్రభుత్వం ఆ స్థాయి యాక్సెస్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డినే. ట్రాప్ చేశారని.. డబ్బులు ఆశపెట్టాలని ఆయన ఎన్నో కథలు చెప్పవచ్చు కానీ అవన్నీ కారణాలే అవుతాయి. రేవంత్ కు.. తెలంగాణ ప్రభుత్వానికి చేసిన ద్రోహమే నిజం.
నమ్మకస్తులే కోవర్టులు
రేవంత్ రెడ్డి కనీసం మంత్రి పదవి కూడా నిర్వహించకుండా సీఎం అయ్యారు. ఆయనకు అనుభవం లేదు. అందుకే మొదట్లో తనతో కలిసి ప్రయాణించిన.. వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని ప్రభుత్వంలో భాగం చేశారు. తనతో ప్రయాణించారు కాబట్టి వారంతా మంచి వాళ్లేనని రేవంత్ అనుకున్నారు. కానీ రాజకీయాల్లో మంచితనానికి , నిజాయితీకి చోటు లేదు. అవకాశం లభిస్తే ఎంతటి వారు అయినా స్వార్థపరులుగా మారిపోతారు. దీన్ని రేవంత్ రాజకీయ స్థాయిలో నమ్మారు కానీ.. తాను తీసుకొచ్చి ప్రభుత్వంలో అందలం ఎక్కించిన వారు కూడా అలా చేస్తారని ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు అదే అనుభవం అయింది.
ఇలాంటి లోపాలను మొత్తం సెర్చ్ చేయాల్సిందే
ఖచ్చితంగా రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించుకుంటున్న సమయంలోనే కోవర్టు గురించి బయటకు తెలియడం.. కాంగ్రెస్ పార్టీని విస్మయానికి గురి చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిని మరింతగా ఆందోళనకు గురి చేసే అంశం. అయితే రాజకీయాల్లో తప్పులు జరిగినప్పుడు ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. ఆ తప్పు వల్ల ఎంత నష్టం జరిగిందో వెంటనే అంచనా వేసి.. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. ప్రతీకారం తీర్చుకోవడం కన్నా.. మళ్లీ మళ్లీ అలాంటి తప్పు జరగకుండా చూడటమే కాదు.. ఇంకా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయేమో పరిశీలన చేసుకోవడం కీలకం.
పూర్తి స్థాయిలో ప్రక్షాళన బెటర్
రెండేళ్ల లోనే ఇలాంటివి బయటపడటం ఓకందుకు సీఎంరేవంత్ రెడ్డికి చాలా మంచి చేస్తుందని అనుకోవచ్చు. ఇప్పటి వరకూ జరగాల్సిన నష్టం ఏం జరిగినా అది రాజకీయంగా పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. కానీ అదే ఎన్నికల మూడ్ పెరిగిన తరవాత ఇలాంటి సమాచారాలు బయటకు వెళ్లి ఉంటే.. ఆయుధాలన్నీ ప్రత్యర్థికి ఇచ్చినట్లే. తమ సొంత కుంపటిలో శత్రువును పెట్టుకున్నట్లే అయ్యేది. అందుకే ఇప్పుడు రేవంత్ మొత్తం ప్రక్షాళన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సన్నిహితులు భావిస్తున్నారు.
