ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టంలో చేర్చేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. విభజన చట్టంలోని 5(2) సెక్షన్ సవరణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. సవరణకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంట్ ఆమోదం అనంతరం అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
అమరావతి రెండో విడత భూసమీకరణ జరుగుతోంది. రైతులకు ఉన్న ఒక్క సందేహం.. రాజధానికి చట్టబద్ధత. ప్రజలు ఇచ్చిన అధికారంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ చట్టబద్ధతను పార్లమెంట్ సాధించడానికి అవకాశం ఏర్పడింది. గతంలో జగన్ అమరావతి రాజధానిగా అంగీకరించి గెలిచిన తర్వాత ప్రజల్ని మూడు రాజధానుల పేరుతో మోసం చేశారు. ఇంకెప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే.. గెజిట్ నోటిఫికేషన్ రావాలని రైతులు కూడా భావిస్తున్నారు. వారి కోరికను తీర్చనున్నారు.
దేశంలో ఫలానా రాష్ట్రానికి .. ఫలానా రాజధాని అని ఎప్పుడూ గెజిట్ ఇవ్వలేదు. అలాంటి అవకాశం కూడా రాలేదు. ఓ రాష్ట్రంలో రాజధానిపై అదే రాష్ట్రంలోని పార్టీలు కుట్రలు చేస్తాయని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రాంతీయ విద్వేషాలతో పబ్బం గడుపుకుంటారని అనుకోలేదు.కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు వచ్చాయి.అందుకే గెజిట్ జారీ చేయాల్సి వస్తోంది.