హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఇప్పుడు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ అతి పెద్ద అపార్టుమెంట్ కాంప్లెక్స్ నిర్మిస్తోంది. ఎల్బీనగర్ మెట్రో నుంచి డైరక్ట్ గా ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి దారి ఉంటుంది. ఆ ల్యాండ్ ఎవరిది ?. ఓ ఫార్మా పరిశ్రమకు ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నారు?. ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావు. కానీ రాజకీయ నాయకులకు వస్తాయి. వారు బయటపెడతారు. అదంతా కేటీఆర్, కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని మంత్రి పొంగులేటి ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు.
హైదరాబాద్ గురించి కాస్త పరిచయం ఉన్న వారికి ఎల్బీనగర్ లో ఉండే సీరిస్ ఫార్మా గురించి తెలుసు. కాకపోతే ఇప్పుడు కాదు.. ఓ ఇరవై ఏళ్ల కిందట హైదరాబాద్ లో ఉన్న వారికి ఆ పరిశ్రమ పెట్టిన కష్టాల గురించి తెలుసు. ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న ప్రాంతంలో పారిశ్రామికవేత్త సీరిస్ రాజు ఫార్మా కంపెనీ పెట్టారు. ప్రభుత్వం నలభై ఎకరాలు లీజుకు ఇచ్చింది. ఆ పరిశ్రమ వల్ల చాలా ఇబ్బందులు అని ఆ చుట్టుపక్కల వాళ్లు నిరసనలు చేశారు. కాలక్రమేణా సీరిస్ మూతపడింది. కానీ బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ గా మారిపోయింది.
ల్యాండ్ కన్వర్షన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేసీఆర్, కేటీఆర్ సంతకాలు చేశారు. దాంతో వాసవి సంస్థకు వెళ్లింది. డెలవప్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం .. అదే పాలసీతో.. హిల్ట్ పేరుతో.. మూతపడిన, కాలుష్య కారక పరిశ్రమల భూములను మల్టీయూజ్ గా మార్చేందుకు పాలసీ తేచ్చింది. కానీ దాన్ని కేటీఆర్ పెద్ద స్కాం అంటున్నారు. మరి సీరీస్ భూముల్లో చేసిందిమిటో చెప్పాలని పొంగులేటి అంటున్నారు. మరి కేటీఆర్ స్పందిస్తారా?. ఎదురుదాడి చేసి ఊరుకుంటారా?
