వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రాధాన్యం పెరిగిన తర్వాత …. వైకుంఠ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. గత పదేళ్లుగా ఈ ట్రెండ్ పెరుగుతోంది. ఏటికేడు భక్తుల సంఖ్య పెరగడంతో టిక్కెట్ల కోసం రష్ పెరిగిపోతోంది. గతంలో తిరుపతిలో ఆఫ్ లైన్ లో టిక్కెట్లు ఇవ్వడం వల్ల తొక్కిసలాట జరిగింది.ఈ సారి టీటీడీ పూర్తి సంస్కరణలు ప్రారభించింది. అందులో భాగంగా పది రోజుల పాటు.. సామాన్య ప్రజలకే ప్రాధాన్యం ఇస్తూ పక్కా ఏర్పాట్లు చేస్తోంది.
వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తిగా సామాన్య భక్తులకే !
గతంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనాలను ఒక్క రోజే నిర్వహించేవారు. తర్వాత రోజు ద్వాదశి కూడా భక్తులు ఎక్కువగా ఇచ్చేవారని కొనసాగించేవారు. అయితే వైసీపీ హయాంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించడం ప్రారంభించారు.అది శాస్త్రం పరంగా కరెక్ట్ కాదన్న వాదనలు ఉన్నాయి. అయితే భక్తులు వెల్లువలా వస్తూండటంతో ఒక్క రోజే నిర్వహించడం కష్టమని.. వారి కోసం అయినా పది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించుకుంది. అందుకే మొదటి మూడు రోజులు లక్కీ డిప్ ద్వారా కేటాయించారు. తర్వాత ఎనిమిది రోజుల పాటు టిక్కెట్లు కూడా అవసరం లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో వీఐపీలకే ప్రాధాన్యం
గతంలో వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యం లభించేది. ఈ సారి కేవలం ప్రోటోకాల్ దర్శనాలకే అవకాశం ఇస్తున్నారు. సిఫారసు లేఖలకు చాన్స్ ఇవ్వడం లేదు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు జరిగే ఈ దర్శనాల్లో 7.70 లక్షల మంది భక్తులు దర్శనం పొందేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటలు సామాన్యులకు మాత్రమే కేటాయించారు. ప్రత్యేక దర్శన, ప్రముఖుల దర్శన టోకెన్లు, ఆఫ్లైన్ సర్వ దర్శన టోకెన్లు 10 రోజుల పాటు రద్దు చేశారు. ప్రముఖులు, దాతలు వ్యక్తిగతంగా వస్తేనే దర్శనం అందించేలా ఏర్పాటు. జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా నేరుగా దర్శనం చేసుకోవచ్చు. తిరుపతి స్థానికులు జనవరి 6, 7, 8 రోజులు దర్శనం చేసుకోవచ్చు.
భక్తులను మెప్పిస్తున్న ఏర్పాట్లు
గతంలో తీసుకున్న అస్తవ్యస్థ నిర్ణయాల వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటిని మెరుగ్గా సంస్కరిచేందుకు ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరోసారి అలాంటి తప్పులు జరగకుండా చూస్తున్నారు. దీని వల్ల భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. తప్పుడు ప్రచారాలు చేయాలనుకునేవారికి అవకాశం లేకుండా చేస్తున్నారు.
