వంద సార్లు సాయం చేయి ఆనందంగా ఉంటారు. మంచోడివని పొగుడుతారు. కానీ ఒక్క సారి పరిస్థితులు బాగోలేకనో.. మన సాయం మీదనే ఆధారపడి కష్టపడటం మానేస్తున్నారని 101 సారి సాయం చేయలేదంటే.. వంద సార్లు చేసిన సాయం గురించి మర్చిపోతూంటారు. ఆ ఒక్క సారి సాయం చేయనందుకు తీవ్రమైన వ్యతిరేకత పెంచుకుంటారు. దూషిస్తారు. నిందిస్తారు. వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఇది మానవ నైజం. సాయం చేసిన వారిలో చాలా మందికి ఎదురయ్యే పరిస్థితి ఇదే. దీనికి పవన్ కల్యాణ్ కూడా అతీతుడేమీ కాదు. పైగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇంకా ఎక్కువ వ్యతిరేక ప్రచారానికి గురి కావాల్సి వస్తుంది.
వ్యక్తిగత సాయాల వల్ల అంచనాలు పెంచుకునే ప్రమాదం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇతరులకు సాయం చేయడానికి ముందు ఉంటారు. వ్యక్తిగతంగా ఆయన ప్రకటిస్తున్న సాయాలు చాలా విరివిగా ఉంటున్నాయి. ఈ సాయాలు అందుకుంటున్న వారు సంతృప్తిగా ఉంటారు. అయితే ఇలాంటి సాయాలు అంతిమంగా మేలు చేయకపోగా వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు సృష్టిస్తాయి. అనేక మంది ఆశలు పెట్టుకుంటారు.. అందరి ఆశలను పవన్ తీర్చలేదు. చివరికి వారు అసంతృప్తికి గురవుతారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోటకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి చోటకు వెళ్లిన చోటల్లా ఆర్థిక సాయం ఆశించేవారు ఉంటారు. ఇలాంటి ఆర్థిక సాయం కోసమే పవన్ ను ఆహ్వానించేవారు ఉంటారు. ఆయనకు తమ సమస్యలు చెప్పుకునేవారు ఉంటారు. ఇవి ఎక్కడో ఓ చోట ఆగేవి కాదు.. అంతకంతకూ పెరిగిపోయేవే !
వ్యక్తిగా చేసే సాయం ఎప్పటికైనా పెను భారమే !
పవన్ కల్యాణ్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు. సినిమా హీరోగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి వచ్చిన కొంత మందికి సాయం చేస్తే పెద్దగా ఎవరూ అంచనాలు పెట్టుకోరు. కానీ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన నుంచి ఆశించేవారు ప్రతి మూల ఉంటారు. అలాంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. రాజకీయ నేతలకు వేల కోట్లు ఉంటాయి. చాలా మంది పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ఉంటారు. వారెవరూ వ్యక్తిగత సాయాలు చేయరు. ఎందుకంటే.. ఓ సారి ఇస్తే అలా అంచనాలు పెంచుకునేవారు ఎక్కువగా ఉంటారు. అలాగని వారు సాయాలు చేయకుండా ఉండరు. అలాంటి సాయాలకు ఓ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా సాయం చేస్తూంటారు.
పవన్ కల్యాణ్ కూడా ఓ ట్రస్ట్ ద్వారా సాయం చేయడం మేలు !
పవన్ కల్యాణ్‌కు సేవాగుణం ఎక్కువ. ఆయన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలనూ పరిష్కరించాలని అనుకుంటారు. అయితే అన్ని సమస్యలూ ఆర్థికంతో ముడిపడి ఉండవు. అలాగే ఆయన దృష్టికి వచ్చే సమస్యలకే పరిష్కారం చూపడం కాకుండా.. ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తాను సేవా కార్యక్రమాల కోసం కేటాయించాలనుకున్న సొమ్మును కేటాయిస్తే వ్యక్తిగతంగా చేసే సాయం కన్నా మిన్నగా సాయం చేయవచ్చు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చంద్రబాబు కుటుంబం ఇలాగే సాయం అందిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం ద్వారా అవగలిగే సాయాన్ని ప్రభుత్వం ద్వారా చేస్తేనే దానికి విలువ ఉంటుంది.
పవన్ కల్యాణ్ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే ఆయన ఆర్థికంగా నష్టం చేసుకుని చివరికి సాయం అందలేదని కొంత మందితో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లుగా మానవనైజం అదే.
