సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ సునీల్ కుమార్ పూర్తి స్థాయి వైసీపీ నాయకుడిగా మారిపోయారు. రఘురామకృష్ణరాజుపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఆయన నేరుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. సివిల్ సర్వీస్ అధికారులకు ఉండే కనీస రూల్స్ ను పట్టించుకోకుండా రాజ్యాంగపదవుల్లో ఉన్న వారిపై , వారి కుటుబంసభ్యులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు.
రఘురామకృష్ణంరాజును ఒక ‘420’గా అభివర్ణిస్తూ, ఆయనపై ఉన్న సీబీఐ కేసుల నేపథ్యంలో తక్షణమే పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రఘురామకృష్ణంరాజుపై గతంలోనే సుమారు రూ. 945 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. ఈ ఎఫ్ఐఆర్లో రఘురామతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని, భారీ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తి కీలక పదవిలో ఉండటం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున ఆయన పదవిలో ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించారు.
డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి తీవ్రమైన ఆర్థిక నేరాల్లో అరెస్ట్ అయితే అది రాష్ట్రానికే తలవంపులన్నారు. ఇటువంటి పరిణామాలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తాయని, పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. తనపై విచారణ సాఫీగా జరగడం కోసం తనను సస్పెండ్ చేసినప్పుడు, వందల కోట్ల కుంభకోణం కేసులో ఉన్న రఘురామను ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆయన చెప్పినవన్నీ సాక్షి పత్రికలో వచ్చేవే. రఘురామను కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఆయనను త్వరలోఅరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. రచ్చకెక్కుతున్నారు. కులం కార్డుతో రాజకీయాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన రాజీనామా చేసి ఇలా వ్యవహరిస్తే ఎవరూ పట్టించుకోరు కానీ.. సర్వీస్‌లో ఉంటూ ఇలా రాజకీయాలు చేయడం వ్యవస్థను వెక్కిరిస్తున్నట్లుగా అవుతోంది.


