ప్రజలకు పనికి రాని పనులను చేసి ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో జగన్ రెడ్డిని మంచినీటి వారులేరు. కోట్ల ఆదాయం వచ్చే రుషికొండ పర్యాటక భవనాలను కూల్చేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నారు. స్టార్ హోటల్ అని చెప్పి నిర్మాణాలు చేశారు. చివరికి అది ఆయనతో పాటు ఆయన కుటుంబం ఉండటానికి కట్టుకున్న ప్యాలెస్ అది. ఇప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలో.. ప్రజాధనాన్ని ఎలా ఉపయోగంలోకి తేవాలో ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. జగన్ రెడ్డి చెప్పినట్లుగా పుతిన్ లాంటి వాళ్లు వచ్చినప్పుడు బస చేయడానికి వినియోగించాలా అంటే.. ఏడాదికోసారి కూడా అలాంటి వారు వస్తారో రారో తెలియదు.
బుర్ర బద్దలు కొట్టుకుంటున్న మంత్రివర్గ ఉపసంఘం
విశాఖపట్నంలోని రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన విలాసవంతమైన భవనాల వినియోగంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం వీటిని పరిశీలించి, పర్యాటక రంగం కింద వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నప్పటికీ, ప్రస్తుత నిర్మాణ శైలి హోటళ్ల నిర్వహణకు ఏమాత్రం అనువుగా లేదని తేల్చి చెప్పింది. ఎందుకంటే అవి .. కుటుంబం కాపురం ఉండేందుకు కట్టారు కానీ.. హోటల్ కోసం కాదు.
30 ఏళ్ల కలతో ప్యాలెస్ కట్టుకున్న జగన్
రుషికొండపై నిర్మించిన భవనాలు వ్యాపార ప్రాతిపదికన కాకుండా ఒక ప్యాలెస్ లా నిర్మించారు. 30 ఏళ్లు తనదే అధికారం అని కలలు కన్న జగన్..తనతో పాటు తన ఇద్దరు కుమార్తెలకు ప్రత్యేకంగా ప్యాలెస్‌లు కట్టించారు. సాధారణంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్లో గదుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ, దాదాపు రూ. 450 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భారీ ప్రాంగణంలో ఉన్నవి కేవలం 12 విలాసవంతమైన సూట్లు మాత్రమే ఉన్నాయి. సాధారణ హోటల్లో ఉండాల్సిన వందలాది గదులు ఇక్కడ లేకపోవడం అతిపెద్ద లోపం. దీనివల్ల భారీ పెట్టుబడికి తగ్గ ఆదాయం వచ్చే అవకాశం లేదు. పైగా, ఈ భవనాల నెలవారీ నిర్వహణ ఖర్చే దాదాపు రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా, ఇది పర్యాటక శాఖకు ఆర్థిక భారంగా మారింది.
విలాసమే తప్ప విజ్ఞత లేదు!
రుషికొండ భవనాల్లో వాడిన వస్తువుల ఖరీదు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కో బాత్ రూమ్ ఫిట్టింగ్స్, కమోడ్లకే లక్షల రూపాయలు వెచ్చించారు. కానీ, ఒక హోటల్‌కు కావాల్సిన కనీస సదుపాయాలైన రిసెప్షన్ ఏరియా, డైనింగ్ హాల్స్, పార్కింగ్ ,గదుల అమరిక వాణిజ్య పరంగా లేవు. ప్రముఖ హోటల్ చైన్స్ కూడా వీటిని పరిశీలించి, అదనపు నిర్మాణాలు చేపడితే తప్ప హోటల్‌గా నడపడం కష్టమని అభిప్రాయపడ్డాయి. దీనికి తోడు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ప్రకారం ఇక్కడ అదనపు నిర్మాణాలు చేయడం కూడా చట్టపరమైన చిక్కులతో కూడుకున్న పని.
ఒకప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి, ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రుషికొండ రిసార్ట్స్‌ను కూల్చేసి, ఎవరికీ ఉపయోగపడని రీతిలో ప్యాలెస్‌లను కట్టడం వల్ల ప్రజల సొమ్ము వృథా అయిందని కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. ఇప్పుడు ఈ వైట్ ఎలిఫెంట్ లాంటి భవనాలను ఎలాగోలా ఆదాయ వనరుగా మార్చడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
