dhandoraa movie review
Telugu360 Rating: 2.5/5
మనిషి ఎంత ఎదిగినా, ఎన్ని సాధించినా కొన్ని సంకుచిత భావాలకు ఇప్పటికీ బంధీగానే ఉన్నాడు. అందులో కులం ఒకటి. ఎన్ని అంటు వ్యాధులకు మందు కనిపెట్టినా, కుల గజ్జికి మాత్రం నివారణ కనుక్కోలేకపోతున్నాం. అగ్ర కులాల ఆధిపత్యాలకు బలైపోయిన కథలెన్నో చరిత్రలో కనిపిస్తాయి. అవి కొన్ని కథలుగా వచ్చాయి. ఇంకొన్ని సినిమాలుగా రూపాంతరం చెందాయి. ‘దండోరా’ కూడా అలాంటి సినిమానే. కాకపోతే దీనికో ప్రత్యేకత ఉంది. ఇన్నాళ్లూ అగ్ర కులాల కాలికింద నలిగిపోయిన నిమ్న జాతి కథలే చూశాం. విన్నాం. ఇది అలా కాదు. ఈసారి అగ్ర కులాల కాటుకు బలైంది ఆ కులపోడే. ఆ పాయింట్ దండోరాకు కొత్త శక్తినీ, ప్రేక్షకులకు కొత్త దృష్టి కోణాన్నీ ఇచ్చింది. ఇంతకీ ఈ ‘దండోరా’ ఎందుకోసం.. ఎవరి కోసం..?
అది 2004. మెదక్ ప్రాంతం. శివాజీ (శివాజీ)కి కులం పట్టింపు ఎక్కువ. మనుషుల్ని కులంతో కొలుస్తుంటాడు. తనకు ఇద్దరు పిల్లలు. కూతురు సుజాత (మనికా చిక్కాల) రవి (రవికృష్ణ) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. రవి బాగా చదువుకొన్నాడు. ఆస్తిపరుడు. దుబాయ్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ సుజాతతో పోలిస్తే తక్కువ కులం. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న విషయం సుజాతకు తెలుసు. అందుకే తనని దుబాయ్ తీసుకెళ్లిపొమ్మని రవిని బతిమాలుతుంది. రవి కూడా దుబాయ్ ఏర్పాట్లలో పడిపోతాడు. అయితే ఈలోగా వీరిద్దరి ప్రేమ విషయం శివాజీతో పాటు.. తన కుల పెద్దలకు తెలుస్తుంది. తన కూతురి ప్రేమకు శివాజీ కూడా అడ్డు నిలుస్తాడు. అప్పుడే కులపోళ్లంతా కలిసి ఓ నిర్ణయం తీసుకొంటారు. అదేమిటి? ఆ తరవాత ఏం జరిగింది? రవి, సుజాతల ప్రేమ కథ ఏ తీరానికి చేరింది? ఈ కథలో సర్పంచ్ (నవదీప్), విష్ణు (శ్రీనందు) పాత్రలేమిటి? వీరందరి జీవితాల్ని కులం ఎలా అతలాకుతలం చేసింది? అనేది దండోరా కథ.
పైపైకి ఇదో ప్రేమ కథలా కనిపిస్తుంది. కానీ లోలోపల చాలా విషయాల్ని సృశించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఓ శవ యాత్ర దగ్గర్నుంచి ఈ కథ మొదలెట్టాడు దర్శకుడు. చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద. అలాంటి మర్యాద పుట్టుక బట్టి, పుట్టిన కులాన్ని బట్టి ఇవ్వడం ఇంకా మన దౌర్భాగ్యం. ఆ ఊర్లో తక్కువ కులంలో పుడితే… పూడ్చడానికి కూడా చోటు లేదు. ఊరవతల వరకూ మోసుకెళ్లాల్సిందే. ఈ అంతిమ యాత్ర నుంచి అసలు కథలోకి ప్రయాణం చేశాడు దర్శకుడు. సుజాత – రవిల కథ రొటీన్ గానే అనిపిస్తుంది. కులం ఈ ప్రేమకథని విడదీయడం కూడా చాలా కథల్లో, సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. ఇంట్రవెల్ లో… ఓ కుదుపు. అక్కడ చాలా విషయాల్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కొన్ని సూటిగా ఉంటే, ఇంకొన్ని మెటాఫర్ రూపంలో దర్శనమిస్తాయి. అర్థం చేసుకొన్నవాళ్లకు అర్థం చేసుకొన్నంత సారాంశం ఉంటుంది. ఒకటి మాత్రం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ దేశంలో ఆకలి చావులు తగ్గాయి కానీ, కులాల చావులు మాత్రం తగ్గలేదన్న సంగతి. ఫస్టాఫ్లో చాలా చోట్ల దర్శకుడు చెప్పీ చెప్పనట్టు కొన్ని విషయాల్ని చెబుతాడు. ఇంకొన్నిసెటైరికల్ గా తగులుతుంటాయి. పెద్ద కులాలంతా కలిసి ఓ బిల్డింగులో మీటింగ్ పెట్టుకొంటే, అక్కడ ఓ గోడ మీద ‘కుల రహిత సమాజం నిర్మిద్దాం’ అని రాసి ఉంటుంది. అది ఈ సమాజంపై దర్శకుడు వేసిన సెటైర్ అనుకోవొచ్చు. ఫస్టాఫ్లో అక్కడక్కడ దర్శకుడి మార్క్ కనిపిస్తుంది. కానీ అసలు కథ సెకండాఫ్ లోనే.
బిందు మాధవిని వేశ్య పాత్రలో ఎంట్రీ ఇస్తుంది. ఆ పాత్రకూ శివాజీకీ ఉన్న అనుబంధం ఆసక్తి కలిగిస్తుంది. మొదట్లో దర్శకుడు సైడ్ ట్రాక్ పట్టాడేంటి? అనిపిపిస్తుంది. కానీ కథలో కొన్ని విషయాల్ని చెప్పడానికి బిందు మాధవి పాత్ర వాడుకొన్నాడన్న సంగతి ఆ తరవాత అర్థం అవుతుంది. శ్రీనందు పాత్ర కూడా అంతే. మొదట్లో అదో అనవసరమైన పాత్రలా తోస్తుంది. కానీ ఆ పాత్రకూ అర్థవంతమైన ముగింపు ఇచ్చాడు. సర్పంచ్ గా చేసిన నవదీప్ పాత్రకూ అంతే. ఈ సినిమా ప్రారంభంలో, నడవడికలో దాగిన కొన్ని అసంతృప్తుల్ని చివర్లో తొలగిస్తాడు దర్శకుడు. క్లైమాక్స్ అర్థవంతంగా కుదిరింది. కోర్ట్ రూమ్ సన్నివేశం బాగుంది. కానీ సంభాషణలు ఇంకాస్త అర్థవంతంగా కుదిరితే ఇంకా బాగుండేది. తొలి సన్నివేశంలో దర్శకుడు ఎత్తుకొన్న పాయింట్ కి చివర్లో ఆన్సర్ దొరికిందనిపిస్తుంది. కానీ అర్థంతారంగా సినిమా ముగిసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. దాంతో పాటు కులాల కుమ్ములాటలకు దర్శకుడి దగ్గర కూడా చికిత్స దొరకలేదన్న సంగతి అర్థం అవుతుంది. అక్కడక్కడ కొన్ని అనవసరమైన పొడిగింపులు, సన్నివేశాలు విసిగిస్తాయి. ముఖ్యంగా ‘టీ` ఎపిసోడ్ ఒకటి. ప్రారంభం చాలా నిదానంగా ఉంటుంది. ఎక్కువ పాత్రలు ఉండడం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. మధ్యమధ్యలో అంబేద్కరిజం ఇమిడ్చే ప్రయత్నం చేశారు.
శివాజీకి ఇది మరో మంచి పాత్ర. కోర్ట్ లో మంగపతిలా ఇది కూడా గుర్తిండిపోతుంది. కోర్ట్ రూమ్ లో శివాజీ నటన ఇంకాస్త మెచ్చుకోదగినది. కూతురి ఆల్బమ్ చూస్తూ, కృంగిపోయేసీన్లో అచ్చమైన తండ్రి కనిపిస్తాడు. బిందు మాధవిది చిన్నపాత్రే అయినా ఇంపాక్ట్ కనిపిస్తుంది. నవదీప్ కూడా అంతే. నందు క్లైమాక్స్ లో రాణించాడు. ప్రేమ జంట కూడా చక్కగా కుదిరింది. చిన్నచిన్న పాత్రలు చేసిన నటులు సైతం మెరిశారు.
దర్శకుడి దగ్గర ఓ మంచి పాయింట్ ఉంది. అగ్ర కులాల ఆధిపత్యానికి అగ్ర కులపోళ్లే బలవుతుంటారు.. వాళ్ల కథలు ఎవరూ చెప్పరు అనుకొని ఈ కథ రాశాడనిపిస్తుంది. కొన్ని చోట్ల తన మాట బలంగా వినిపించింది. ఇంకొన్ని చోట్ల తన బలం సరిపోలేదు. ఫస్టాఫ్ లో చూపించిన ప్రేమకథని వైవిధ్యంగా చూపిస్తే బాగుండేది. కాకపోతే ఇది లవ్ స్టోరీ కాదు కాబట్టి, రొటీన్ పంథానే అనుసరించాడు. సెన్సార్ కత్తెరకు కొన్ని సన్నివేశాలు బలైనట్టు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంత ప్రజల యాస, భాషని కెమెరాలో బాగానే బంధించారు. తొలి సన్నివేశాలు చూస్తున్నప్పుడు బలగం సినిమా గుర్తొస్తుంటుంది. ఆ తరవాత ‘దండోరా’ రూటు మార్చుకొంది.
Telugu360 Rating 2.5/5
