భారత వ్యతిరేకతతో బంగ్లా యువత రగిలిపోతోంది. భారత్ పట్ల సానుకూలంగా ఉన్న వారిని అక్కడ దేశద్రోహులుగా లెక్క కడుతున్నారు. అలాంటి భావజాలం వ్యాప్తి చేస్తున్నారు. హిందువులపై పగలతో రెచ్చిపోతున్నారు. కానీ వారి భాష ఉర్దూ లేదా అరబిక్ కాదు. వారు ముస్లింలుగా మారకముందు బెంగాలీలు. వారి మాతృభాష బెంగాలీ.
అసలు బంగ్లా ఏర్పాటుకు కారణం భాష. పాకిస్థాన్ తమపై ఉర్దూ భాషను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించినప్పుడే బెంగాలీ ప్రజలు తిరుగుబాటు చేశారు. 1952లో జరిగిన భాషా ఉద్యమం ఫలితంగా, పాకిస్థాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడటంలో ఈ భాషా గుర్తింపు కీలక పాత్ర పోషించింది. హిందీ లేదా ఉర్దూ భాషలు అక్కడ సామాన్య ప్రజలకు పెద్దగా అర్థం కావు. సాధారణంగా ముస్లింలు అంటే.. ఉర్దూ లేదా అరబిక్ వారి మాతృభాష అనుకుంటారు. కానీ బంగ్లా ముస్లింలకు బెంగాలీనే మాతృభాష.
రాజకీయ నాయకులు బెంగాలీ భాషలోనే ప్రసంగిస్తారు. పార్లమెంటు చర్చలు, అధికారిక ప్రకటనలు, బహిరంగ సభలు అన్నీ బెంగాలీలోనే జరుగుతాయి. అన్ని న్యూస్ ఛానెళ్లు మరియు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు బెంగాలీలోనే ప్రసారమవుతాయి. 98 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు బెంగాలీనే మాట్లాడతారు. ముస్లిం దేశం కావడంతో మతపరమైన ప్రార్థనలకు, ఖురాన్ పఠనానికి అరబిక్ ఉపయోగిస్తారు. కానీ ఇది దైనందిన సంభాషణల్లో ఉండదు. బెంగాలీ.. బెంగాల్ ప్రజల మాతృభాష. కానీ దేశం విడిపోవడంతో వారు వేరయ్యారు.
