జగన్మోహన్ రెడ్డి రాను రాను ఓ రకమైన ఆత్మన్యూనతలో పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనను ఎవరూ పట్టించుకోరు అన్న భావన పెరిగిపోతున్నట్లుగా ఉంది. ఎక్కడికి వెళ్లినా చుట్టూ జనం లేకపోతే తనను మర్చిపోయారని అనుకుంటారని గట్టిగా భయపడుతున్నారు. ఆ భయం పులివెందుల పర్యటనలోనూ కనిపించింది. చివరికి క్రిస్మస్ ప్రార్థనలు చేసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున జనం ఉండేలా చూసుకున్నారు. జగన్ ను కలిసేందుకు రావాలని చుట్టుపక్కల ఉన్న క్యాడర్ ను ప్రత్యేకంగా పిలిచి జన సమీకరణ చేశారు.
జగన్ మూడురోజుల ముందుగానేపులివెందులకు వచ్చారు. వచ్చిన రోజున మూడు, నాలుగు గంటల పాటు ప్రజాదర్బార్ నిర్వహించారు. కానీ తర్వాత రోజు జ్వరం కారణంగా ఆయన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనలేదు. అదే సమయంలో ప్రజల్ని కూడా కలవలేదు. ఆ రోజు జన సమీకరణకు ప్లాన్ చేయలేదని.. ఆయన ముందస్తు క్రిస్మస్ వేడుకలకు చర్చికి వస్తే బంధువుల తప్ప ఎవరూ ఉండరన్న సమాచారంతోనే బయటకు రాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జ్వరం కారణంగా ప్రార్థనలకు దూరంమయ్యారనేది అవాస్తవం అంటున్నారు.
క్రిస్మస్ రోజు జన సమీకరణ చేయడంతో ఆయన ప్రార్థనలు చేసి.. చర్చి బయట కనిపించిన జనంతో కాస్త స్థిమితపడ్డారు. ఆ తర్వాత హెలికాఫ్టర్లో బెంగళూరు వెళ్లిపోయారు.కానీ ఇలా వ్యక్తిగత కార్యక్రమాలకూ.. రాజకీయ కార్యక్రమాలకూ తేడా లేకుండా.. జగన్ మోహన్ రెడ్డి జనాలు కావాలని .. తను అడుగు బయటపెడితే తోపులాటలు జరగాలని అనుకోవడం.. అలా లేకపోతే బయటకు రాకుండా ఉండటం మాత్రం.. వైసీపీ నేతలకు కూడా వింతగా అనిపిస్తోంది.