బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పదిహేను రోజుల్లో మూడు బహిరంగసభలు పెడతామని అంటున్నారు. ఇలా చెప్పి వారం అవుతోంది కానీ ఇప్పటి వరకూ ఒక్క బహిరంగసభ తేదీని ఖరారు చేయలేదు. ఎక్కడ పెట్టాలో కూడా నిర్ణయించలేదు. కానీ కేసీఆర్ మాత్రం సమావేశాల పేరుతో హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు లేని ఇష్యూను తెరపైకి తెచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కృ,్ణా నీటి విషయంలో కొత్తగా ఎలాంటి డెలవప్‌మెంట్స్ లేకపోయినా ఎప్పుడో జరిగిపోయిన వాటితో హడావుడి చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అన్న సందేహం చాలా మందికి వస్తున్నా.. సమాధానాలు మాత్రం ఇప్పుడే మెల్లమెల్లగా తెలుస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఖాయమని ప్రచారం
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దాదాపుగా పూర్తయిందనుకున్న దశలో తెలంగాణ ప్రభుత్వం అనూహ్యగా సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది. ఏమీ దొరకక సిట్ ను ఏర్పాటు చేసిందని అనుకున్నారు.కానీ పెద్ద స్థాయి వ్యక్తులను విచారణకు పిలవాలన్నా..అరెస్టులు చేయాలన్నా ఆ స్థాయి అధికారులు ఉండాలన్న ఉద్దేశంతో సజ్జనార్‌కు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన కూడా సీరియస్ గానే ఉన్నానని సంకేతాలు పంపుతున్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ లతో సన్నిహితంగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ గుర్తుండనట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ విషయం కేసీఆర్ గుర్తు పట్టేశారని అందుకే ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
నోటీసుల్ని బట్టే బహిరంగసభల తేదీలు?
పదిహేను రోజుల్లో బహిరంగసభలు అని కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఆ తేదీలు.. ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి వచ్చే నోటీసుల్ని బట్టి ఉంటాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డిజిల్లాలకు చెందిన నేతల్ని ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడారు కేసీఆర్. కానీ తేదీలను ఖరారు చేయలేదు. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని అవి అయిపోయాక బహిరంగసభల తేదీలను ఖరారు చేద్దామని చెప్పారు. ఆ లోపే పోలీసుల నోటీసులు వస్తే దానికి తగ్గట్లు బహిరంగసభలు నిర్వహించనున్నారు. తాము జనాల్లోకి వస్తూంటే భయపడి అడ్డుకోవడానికి కేసులు, నోటీసులు అని ఆరోపించడానికి బాగుంటుందని అనుకుంటున్నారు.
అరెస్టుల భయంతోనే తిట్లందుకుంటున్నారా?
రెండేళ్లుగా కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ప్రెస్మీట్లు పెట్టి తిట్లందుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇస్తే. .. మరింతగా తిడుతున్నారు. ఇది రెచ్చగొట్టే వ్యూహమా లేకపోతే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా అన్నది రెండు వర్గాలకే తెలుసు. కానీ రాజకీయం మాత్రం మారిపోయింది. ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్నారు. దీనికి బ్యాక్ గ్రౌండ్ మాత్రం తెర వెనుక కదులుతున్న కేసుల వ్యవహారమే అనుకోవచ్చు.
