మహిళలపై నోరు పారేసుకొనేవాళ్లందరికీ శివాజీ ఎపిసోడ్ ఓ గుణపాఠం. మనం మాట్లాడే ప్రతీ మాటా…. ఆచి తూచి మాట్లాడాలి, ముఖ్యంగా మీడియా ముందు.. అనే విషయాన్ని ఇప్పటి నుంచి సెలబ్రెటీలు ఇంకా బాగా గుర్తు పెట్టుకొంటారు. శివాజీ ఎపిసోడ్ ముగిసినట్టే. ఆయన కూడా ఈ విషయంపై మరోసారి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. `ఇక్కడితో వదిలేద్దాం` అని మీడియా ముందే చెప్పేశారు.
శివాజీ విషయంలో మహిళా కమీషన్ ఎలెర్ట్ అయిన విధానం మెచ్చుకోదగినది. మీనమేషాలు లెక్క పెట్టుకోకుండా సత్వరం రంగంలోకి దిగారు. శివాజీకి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు కమీషన్ ముందుకు పిలిపించుకొని, వివరణ తీసుకొన్నారు. మహిళలపై సెలబ్రెటీలు నోరు జారితే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థమయ్యేలా చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ సత్వర న్యాయం, వేగవంతమైన ప్రతస్పందన కేవలం సెలబ్రెటీల వరకేనా? అనేది డౌటు.
సోషల్ మీడియా పెరిగిపోయాక.. ఎవర్నీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎవరైనా, ఎక్కడి నుంచైనా, ఎలాంటి కామెంట్ అయినా చేసేయొచ్చు. వాళ్లు ఏదైనా మాట్లాడేయొచ్చు. ఏమైనా అడిగితే వ్యక్తిగత స్వేచ్ఛ అని సమాధానమిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై అసభ్యంగా మాట్లాడేవాళ్లు, మార్ఫింగులకు పాల్పడేవాళ్లు, కథానాయికల్ని ఆట వస్తువులుగా, బొమ్మలుగా చూసేవాళ్లు కోకొల్లలుగా కనిపిస్తారు. వాళ్లందరి విషయంలోనూ ఇంతే స్పీడుగా రియాక్ట్ అయితే బాగుంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో భార్యల గురించీ, ఇంట్లో ఆడవాళ్ల గురించీ నీచంగా మాట్లాడి, సభ్య సమాజం చెవులు మూసుకొనేలా చేసిన వాళ్లెంతోమంది కనిపిస్తారు. రాజకీయ మైలేజీ పెంచుకొనేందుకు అడ్డమైన వాగుడు వాగినవాళ్లెందరెందరో..? ఫేక్ ఎకౌంట్లు సృష్టించి.. ముసుగు వేసుకొని.. చీకట్లో దాక్కుని.. తమ విషాన్ని కక్కాలని చూసినవాళ్ల జాబితా తీస్తే చాంతాడంత ఉంటుంది. వాళ్లలో కొంతమందినైనా బయటకు లాగి, శిక్ష విధిస్తే.. ఎంత బాగుండేది?
సాధారణంగా సెలబ్రెటీలకో న్యాయం.. సామాన్యులకో న్యాయం అనే మాట వినిపిస్తుంది. తప్పు చేస్తే సెలబ్రెటీలు ఈజీగా తప్పించుకుపోవొచ్చని అనుకొంటారు. కానీ సెలబ్రెటీల్లో సినిమా సెలబ్రిటీలు వేరు. వాళ్లు ఈజీగా దొరికేస్తారు. సినిమా వాడు తప్పు చేస్తే.. ఏమాత్రం తప్పించుకోలేడు. క్షణాల్లో విచారణ ఉంటుంది. అప్పట్లో అల్లు అర్జున్ విషయం కానివ్వండి.. ఇప్పుడు శివాజీ ఇష్యూ కానివ్వండి. వ్యవస్థలు సత్వరం స్పందిచాయి. స్పందించాలి కూడా. కానీ.. ఒక్క సినిమావాళ్ల విషయంలోనే కాదు. అందరి విషయంలోనూ ఈ వేగం ఉండాలి. సామాన్యుడి ముసుగులో అరాచకాలు సృష్టిస్తున్న వాళ్లెంతోమంది ఉన్నారు. వాళ్లందర్నీ జల్లెడ పడితే వందలు, వేలు కనిపిస్తారు. అలాంటి వాళ్లని కూడా పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి. ట్విట్టర్ లో ఒక్క అక్షరం టైపు చేయడానికైనా, ఆడవాళ్లని ఉద్దేశించి ఓ మాట మాట్లాడడానికైనా వణుకు పుట్టేలా చర్యలు ఉండాలి. సెలబ్రెటీలనే విడిచిపెట్టలేదు.. మనమెంత? అనే భయం కలగాలి. ఆ దిశగా మహిళా కమీషన్లు చర్యలు చేపడితే.. సోషల్ మీడియాని అడ్డాగా చేసుకొని, రెచ్చిపోతున్న అరాచక వాదులకు కళ్లెం వేయగలిగితే.. తప్పకుండా మార్పు చాలా వేగంగా, గట్టిగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో సెలబ్రెటీలూ, సామాన్యులూ అనే తారతమ్యం చూడకుండా కఠినమైన చర్యలు తీసుకొంటే… తప్పకుండా ఫలితాలు కనిపిస్తాయి.
