కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ్ అని మార్చింది. షార్ట్ కట్లో వీబీ జీరామ్ జీ అనిపిలుసతున్నారు. పేరు మాత్రమే కాదు.. పథకంలో సమూల మార్పులు చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, పథకం విధివిధానాల్లో చేసిన మార్పులు బీజేపీకి రాజకీయంగా కొన్ని సవాళ్లను, మరికొన్ని విమర్శలను ఎదుర్కొనేలా చేసే అవకాశం ఉంది.
మహాత్ముడి పేరు తొలగింపు – భావోద్వేగ సమస్య
పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా బీజేపీకి మొదటి సమస్య ఎదురవుతోంది. గాంధీజీ పేరును పక్కన పెట్టడం అంటే ఆయన ఆశయాలను, గ్రామీణ స్వరాజ్య భావనను విస్మరించడమేనని విపక్షాలు కాంగ్రెస్, తృణమూల్, కమ్యూనిస్టులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ఇది గ్రామీణ ఓటర్లలో, ముఖ్యంగా గాంధీజీపై గౌరవం ఉన్న వర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒక సెంటిమెంట్‌ను సృష్టించే ప్రమాదం ఉంది. దేశ స్వాతంత్య్ర చరిత్రను, చిహ్నాలను బీజేపీ మార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సిద్ధాంతపరంగా గాంధీకి బీజేపీ వ్యతిరేకమన్న ప్రచారం ఇప్పటికే ఉంది.
రాష్ట్రాలపై ఆర్థిక భారం
కొత్త నిబంధనల ప్రకారం, ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం వాటాను తగ్గించి, రాష్ట్రాల వాటాను పెంచారు. గతంలో 25 శాతం రాష్ట్రాలు భరించాలి కానీ..ఇప్పుడు 40 శాతం భరిచాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీ చట్టబద్ధమైన హక్కు. కానీ కొత్త విధివిధానాల ప్రకారం, ఇది ఒక కేంద్ర ప్రాయోజిత పథకంగా మారిపోతుందని, దీనివల్ల డిమాండ్ ఆధారిత పని కల్పన తగ్గుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని ఎప్పుడు ఇవ్వాలో కేంద్రం నిర్ణయించడం, వ్యవసాయ సీజన్లో పనిని నిలిపివేయాలని నిర్ణయించడం వంటివి కూలీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. ఒకవేళ క్షేత్రస్థాయిలో కూలీలకు పని దొరకడంలో జాప్యం జరిగినా, వేతనాలు ఆగినా ఆ కోపం నేరుగా కేంద్ర ప్రభుత్వంపైనే పడే అవకాశం ఉంది.
అవినీతి నిర్మూలన సాధ్యం కాదు !
ఏఐ ఆధారిత ఆడిట్స్, బయోమెట్రిక్ హాజరు, మొబైల్ యాప్స్ వంటి కఠినమైన నిబంధనలు పారదర్శకత కోసం అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లోపాలు, సాంకేతిక అవగాహన లేకపోవడం వల్ల కూలీలు నష్టపోయే ప్రమాదం ఉంది. తమ వేతనాలు నిలిచిపోవడానికి కేంద్రం తెచ్చిన నిబంధనలే కారణమని పేదలు భావిస్తే, అది బీజేపీ గ్రామీణ ఓటు బ్యాంకుపై దెబ్బకొడుతుంది. ముఖ్యంగా పేదలు, దళితులు, ఆదివాసీలు ఈ పథకంపై ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి, వారిలో అసంతృప్తి బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికరం.
ఈ అంశంపై కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు ఈ అంశంపై ఏకమవుతున్నాయి. బీజేపీ పేదల వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి ఇది ఒక ఆయుధంగా మారుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగంతో ఉన్న గ్రామీణ ప్రజలకు, ఈ పథకం మార్పులను విపక్షాలు ప్రతికూలంగా వివరించడంలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గ్రామీణ ఓటర్ల మద్దతు తగ్గవచ్చు. అయితే, ప్రభుత్వం పనిదినాలను 100 నుండి 125 రోజులకు పెంచామని, వేతనాలు పెంచామని చెప్పుకుంటున్నప్పటికీ, పేరు మార్పు , ఆర్థిక భారం అనే అంశాలు ఈ ప్రయోజనాలను మరుగున పడేసేలా చేస్తున్నాయి.
