తమిళ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలికినట్లుగా ప్రకటించారు. రాజకీయాల్లో తన భవిష్యత్తును, రాబోయే 30 ఏళ్ల ప్రజా సేవను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. రెండు పడవల మీద ప్రయాణిస్తానంటే ప్రజలు సీరియస్‌గా తీసుకోరు. ఆ విషయంపై ఆయనకు స్పష్టత ఉంది. అందుకే చివరి సినిమాగా జననాయగన్‌ను ప్రకటించారు. మలేషియాలో జరిగిన జననాయగన్ కార్యక్రమంలో ఈ విషయం ప్రకటించారు.
రాజకీయాల్లో 30 ఏళ్ల లక్ష్యం
దర్శకుడి కుమారుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్ ఇప్పుడు ఆ అభిమాన బలంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపై తన జీవితం పూర్తిగా ప్రజలకే అంకితమని, రాజకీయాల్లో మరో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేస్తానని ఆయన ప్రకటించేశారు. విజయ్ మొత్తం 69 సినిమాల్లో నటించారు. జన నాయగన్ ను కేవలం ఒక సినిమాగా కాకుండా, తన రాజకీయ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక శక్తివంతమైన సాధనంగా ఎంచుకున్నారు. ఇంతకాలం నన్ను ఆదరించిన అభిమానుల కోసం, వారి భవిష్యత్తు కోసం మరో 30 ఏళ్లు ప్రజాక్షేత్రంలో నిలబడతానని ప్రతిజ్ఞ చేశారు. అంటే రాజకీయాల్లో 30 ఏళ్ల కెరీర్ ను టార్గెట్ గా పెట్టుకున్నారని అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ శూన్యతను పక్కాగా వాడుకునే ప్లాన్‌లో విజయ్
విజయకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని చాలా కాలం క్రితమే స్పష్టమయింది. కానీ అప్పట్లో జయలలిత, కరుణానిధి వంటి వారి మధ్య రాజకీయ శూన్యత లేదు. వారిద్దరూ మరణించిన తర్వాత స్టాలిన్ మాత్రమే బలమైన ప్రజా బలం ఉన్న నేతగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు పోటీగా మరో నేత లేరు. ఆ శూన్యతను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు విజయ్. తన అభిమాన బలాన్ని వ్యూహాత్మకంగా వాడుకుంటూ బలప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతున్నారు. కరూర్ సభలో తొక్కిసలాట ఘటనతో ఒత్తిడికి గురైనా ఆయన తట్టుకుంటున్నారు.
పార్ట్ టైమ్ నాయకుడ్ని కాదని నమ్మించే ప్రయత్నం !
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించినా అది ప్రజల్ని నమ్మించడానికే కానీ.. శాశ్వతంగా ఆయన సినిమాలకు దూరమవడం అసాధ్యం అని అనుకోవచ్చు. రాజకీయాల్లో 30 ఏళ్ల కల సాకారం కావాలంటే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కీలకం. 2026 తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ సాధించే ఓట్ల శాతం తో పాటు సీట్లే విజయ్ రాజకీయ పటిష్టతను నిర్ణయిస్తాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనా, 30 ఏళ్ల పాటు నిలబడతానని చెప్పడం ద్వారా ఆయన తను కేవలం ఒక ‘పార్ట్ టైమ్’ పొలిటిషియన్ కాదని, ఒక సీరియస్ ప్లేయర్ అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. విజయ్ ప్రధాన బలం యువత. సినిమాలకు స్వస్తి చెప్పడం వల్ల అభిమానులు పూర్తిస్థాయిలో కార్యకర్తలుగా మారి ఓట్లు కురిపిస్తారని భావిస్తున్నారు. సినిమా హీరోగా ఉంటే.. హీరోగానే ఆయనను చూస్తారు. రాజకీయ నాయకుడిగా చూడటం కష్టం.
సినిమాల్లో రిటైర్మెంట్ ప్రజల చేతుల్లోనే ఉంది !
సినిమాలు చేస్తూ రాజకీయం చేయడం వల్ల ప్రజలు తనను సీరియస్‌గా తీసుకోరనే భావన విజయ్‌లో ఉంది. అందుకే, కోట్లు కురిపించే సినీ సామ్రాజ్యాన్ని వదులుకుని, కేవలం ప్రజల కోసం పనిచేస్తానని చెప్పడం ద్వారా ఆయన తన ‘నిజాయితీ’ ని చాటుకోవాలని చూస్తున్నారు. విజయ్ రాజకీయాల్లో 30 ఏళ్ల కల సక్సెస్ కావాలంటే కేవలం సినిమా క్రేజ్ మాత్రమే సరిపోదు. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, స్పష్టమైన మేనిఫెస్టో, పాలక పక్షాల లోపాలను సమర్థవంతంగా ఎండగట్టడం మీదనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది ఒక సాహసోపేతమైన ముందడుగు, కానీ ఇది రేపు ఎదురుదెబ్బలు తగిలి ఖాలీగా ఉండాల్సి వస్తే.. ఆయన మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు. అది సహజమైన విషయం.
