భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలో ముంబై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో జరిగిన ఒక భూమి వేలం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న 2.5 ఎకరాల రైల్వే భూమికి ఊహించని రీతిలో భారీ బిడ్ దాఖలైంది. రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన ఈ వేలంలో, దినేష్చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ అనే సంస్థ సుమారు రూ. 2,250 కోట్ల భారీ ధరను ఆఫర్ చేసింది. అంటే ఒక ఎకరం భూమి ధర సుమారు రూ. 900 కోట్లు. దేశ చరిత్రలోనే ఒక ఎకరం భూమికి ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి.
సాధారణంగా దేశ రాజధానిలోని ‘లూటియన్స్ ఢిల్లీ’ ప్రాంతం అత్యంత ఖరీదైనదిగా భావిస్తారు. అక్కడ ఎకరం భూమి ధర సుమారు రూ. 450 కోట్ల నుండి రూ. 500 కోట్ల వరకు ఉంటుంది. అయితే, తాజా మహాలక్ష్మి డీల్ లూటియన్స్ ఢిల్లీ రేటు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా పలికింది. ఇది ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది.
ముంబైలో అత్యంత సంపన్నులు, పారిశ్రామికవేత్తలైన అంబానీ, బిర్లా వంటి వారు నివసించే కార్మైకేల్ రోడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అక్కడ కూడా భూమి ధరలు ఆకాశాన్నంటుతాయి. కానీ, ఈ మహాలక్ష్మి ల్యాండ్ డీల్ కార్మైకేల్ రోడ్ లోని సగటు ధరల కంటే 50 శాతం ఎక్కువగా ఉంది. అంటే, అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతాల కంటే కూడా ఈ ప్రాంతం ఇప్పుడు హాట్ కేక్ లా మారిపోయింది.
ఈ భూమి కోసం దేశంలోని దిగ్గజ డెవలపర్లు పోటీ పడ్డారు. లోధా గ్రూప్ , శోభా రియాల్టీ , RMZ గ్రూప్ వంటి సంస్థలు భారీ మొత్తంలో బిడ్లు వేసినప్పటికీ, దినేష్చంద్ర అగర్వాల్ సంస్థ రికార్డు స్థాయి ధరతో వీటిని సొంతం చేసుకుంది. ఈ భూమిలో భారీ వాణిజ్య సముదాయాలు లేదా అత్యాధునిక లగ్జరీ అపార్ట్మెంట్లు నిర్మించే అవకాశం ఉంది.
