జగన్ రెడ్డి హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరి చేయడానికి చేసిన ప్రయత్నాలు చివరికి ఓ మంత్రి కన్నీరు పెట్టడానికి కారణం అయ్యాయి. రాయచోటి జిల్లాకు స్పేస్ లేకపోయినా గత ప్రభుత్వం రాజకీయంగా పట్టు నిలుపుకోవడానికి రాయచోటిని జిల్లాకేంద్రంగా చేసి అన్నమయ్యజిల్లాను ఏర్పాటు చేసింది. మదనపల్లె జిల్లా డిమాండ్ చాలా కాలంగా ఉన్నా పట్టించుకోలేదు. రాయచోటి ఎలా మిగతా ప్రాంతాలకు అనుకూలం కాదు. కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు అన్ని పరిశీలనలు జరిపి మదనపల్లెను జిల్లాగా ఖరారు చేసింది.
దీంతో రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కేబినెట్ భేటీలో చంద్రబాబు ఓదార్చారు. భౌగోళిక, పరిపాలనా సౌలభ్య కారణాలతోనే మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాయచోటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం మార్కాపురం జిల్లా. మార్కాపురం , కనిగిరి రెవెన్యూ డివిజన్లు .. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడం , జెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా జిల్లా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు తాత్కాలిక భవనాలను గుర్తించి, శాశ్వత కలెక్టరేట్లకు నిధులు కేటాయించనున్నారు. జనవరి 1 నుంచి కొత్త జిల్లాలు ఉనికి వస్తాయి. గూడూరును నెల్లూరులోనే ఉంచారు. అత్యధికంగా ప్రజల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
