వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. అలాంటి వీఐపీల్లో వైసీపీ నేతలు రోజా, మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా చాలా మంది ఉన్నారు. ఏ హోదా లేని వైసీపీ నేతలకు ఎందుకు వీఐపీ దర్శనాలు కల్పించారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనిపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది.
రెండు రోజులుగా తిరుమలలో వైసీపీ నాయకులకు నిబంధనలకు విరుద్ధంగా దర్శన భాగ్యం కల్పించారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఎవరికీ నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలు కల్పించలేదని స్పష్టం చేసింది. తిరుమలలో అమలయ్యే సాధారణ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారమే దర్శనాలు జరిగాయని తెలిపింది.
వీఐపీలు స్వయంగా వస్తేనే ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తున్నారు. అందులో భాగంగా రోజా.. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కోటాలో దర్శనానికి వచ్చారు. ఆ లేఖను టీటీడీ విడుదల చేసింది. ప్రస్తుతం పదవుల్లో ఉన్న ఎంపీలు లేదా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ద్వారా మాత్రమే వారికి దర్శన టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించింది. ప్రజాప్రతినిధుల కోటా అనేది చట్టబద్ధంగా వచ్చే హక్కు అని, దానిని నిరాకరించే అధికారం బోర్డుకు ఉండదని వివరణ ఇచ్చింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన జరుగుతోందని, ప్రతి టికెట్ జారీలోనూ పారదర్శకత పాటిస్తున్నామని బోర్డు తెలిపింది. ఎవరైనా సరే నిబంధనల పరిధిలో వస్తే దర్శనానికి అనుమతిస్తామని, ప్రత్యేకంగా ఏ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించడం లేదని తేల్చిచెప్పింది. వైసీపీ నేతలు అయినంత మాత్రాన దర్శనాలు చేసుకోకూడదని విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు.
