మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజీకి ఎల్ అండ్ టీ సంస్థను బాధ్యత తీసుకోవాలని ఉచితంగా పునరుద్ధరణ చేసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. దీనికి ఎల్ అండ్ టీ స్పందించకపోవడంతో క్రిమినల్ కేసు పెట్టేందుకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ఎల్ అండ్ టీ వ్యూహాత్మకంగా స్పందించింది. తాము మేడిగడ్డను పునరుద్ధరిస్తామని చెప్పింది. అయితే ఓ మెలిక పెట్టింది. తమకు ఇంకా ఈ ప్రాజెక్టులో భాగంగా చేసిన పనులకు పెండింగ్ మొత్తాలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉన్నాయని అవి ఇస్తే.. తాము పనులు చేపడతామని ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది.
కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ ను ఎల్ అండ్ టీ సంస్థే నిర్మించింది. అది కుంగిపోయినందున .. పునర్ నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ఆ సంస్థదేనని ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ సంస్థకు ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. దాంతో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు పునరుద్ధరణ చేయాలని పర్భుత్వం అడుగుతున్నందున.. ఆ బిల్లులు ఇస్తే చేస్తామని ఎల్ అండ్ టీ సమాధానమిచ్చింది. దీనికి ప్రభుత్వం ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా ఉంది.
ఎల్ అండ్ టీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా సరిపడటం లేదు. హైదరాబాద్ మెట్రో విషయంలోనూ వివాదమే. చివరికి మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ అంశంలోనూ కొన్ని లెక్కలు తేలాల్సి ఉంది. మేడిగడ్డను ఇంకా అంత కాలం ఉంచుతారని.. ఎందుకు రిపేర్లు చేయించరని బీఆర్ఎస్ ఓ వైపు విమర్శలు గుప్పిస్తోంది. ఖర్చు లేకుండా.. రిపేర్లు చేయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ దిశగా ఓ అడుగు ముందుకు పడింది.
